Idream media
Idream media
హాయిగా సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్‌కల్యాణ్‌కి జగన్ తలనొప్పి తెచ్చి పెట్టాడు. రాజకీయాల్లోకి రావడం అంటే భేతాళుడిని తెచ్చి భుజం మీద వేసుకున్నట్టే. తలలు తినేస్తాడు.
జనసేనని లాగడం అంత ఈజీ కాదని తెలిసే పవన్ బీజేపీతో చేరిపోయాడు. ఎవరినైనా నిలదీస్తామంటూ ఢిల్లీలో చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సరే, ఆయన పార్టీ ఆయన ఇష్టం. కాకపోతే ఇద్దరు ఈతరాని వాళ్లు ఒకర్నొకరు పట్టుకుని నీళ్లలోకి దూకారు.
ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చాయి. గ్రామాల్లో ఎలాగూ ఇద్దరికీ బలం లేదు. బీజేపీ గెలవలేక పోయినా మున్సిపాల్టీల్లో ఎంతోకొంత ఓట్లున్నాయి. వీళ్లిద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయకతప్పదు. కార్పొరేషన్లు , మున్సిపాల్టీల్లో పవన్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. చేస్తే షూటింగ్‌లు ఆగిపోతాయి. నిర్మాతలు లబోదిబో.
గ్రామాల్లో పటిష్టంగా పార్టీ నిర్మాణం ఉన్న తెలుగుదేశమే ఈ ఎన్నికలంటే భయపడుతోంది. తెలంగాణలో TRS గెలిచినట్టు ఇక్కడ కూడా వైసీపీనే గెలుస్తుంది. స్థానిక, లేదా ఉప ఎన్నికల్లో అధికార పార్టీనే గెలుస్తుంది. నంద్యాలలో బ్రహ్మాండంగా గెలిచి, తర్వాత జనరల్ ఎన్నికల్లో TDP ఘోరంగా ఓడిపోయింది. మరి ఆ బలం ఏమైంది అంటే , అది బలం కాదు అధికారం. సహజంగానే మెజార్టీ స్థానాల్లో వైసీపీనే గెలుస్తుంది. జగన్ పట్ల వ్యతిరేకత ఉంటే బయటపడుతుందని TDP ఆశలు పెట్టుకొంది కానీ, అవన్నీ దింపుడు కల్లం ఆశలే. ఎందుకంటే జగన్ పథకాలు జనంపై ప్రభావం చూపుతున్నాయి. అభివృద్ధి ఆగిపోయిందని పత్రికల్లో రాసినా , అవి సామాన్య జనానికి అవసరం లేదు.
మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశమే చేతులెత్తేసే పరిస్థితి ఉంటే పవన్‌కల్యాణ్ వచ్చి ఏం చేస్తాడు. ఎమ్మెల్యే ఎన్నికల్లో జరిగినట్టు ఇక్కడ కూడా ఘోర పరాభవం జరగకుండా ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ పవన్‌కి పార్టీ నడపడంపై అవగాహన లేదు. ఎప్పటికీ రాదు కూడా.
బీజేపీ కూడా చాలా కన్ఫ్యూజన్‌లో ఉంది. ఒకవైపు అధిష్టానం జగన్‌తో బాగానే ఉంది. అది స్పష్టంగా తెలుస్తూ ఉంటే జగన్ మీద ఏ ధైర్యంతో రాష్ట్ర నాయకులు విమర్శలు చేయగలరు?
ఇప్పుడు పవన్ షూటింగ్‌లు మానేసి ప్రచారానికి దిగినా సరే అస్త్రాలు ఎక్కడున్నాయ్? మంచో చెడో జగన్ తన పథకాలు అమలు చేసుకుంటూ వెళుతున్నాడు. వాటిని విమర్శించలేడు. బీజేపీతో ఉన్నాడు కాబట్టి మైనార్టీలు నమ్మరు. అధికారుల్లో అవినీతి తగ్గలేదు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలపై కుంభకోణ ఆరోపణలు లేవు. ఇసుక సమస్య ఇంకా ఉన్నా అది ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో లేదు. మూడు రాజధానులు నలిగిపోయిన సబ్జెక్ట్. పైగా ఎప్పుడో ఒకసారి జనంలో కనిపించే జనసేనానికి విశ్వసనీయత ఎక్కడుంది.
పోటీ చేయకపోతే గౌరవం దక్కుతుంది.
చేస్తే అవమానం మిగులుతుంది.