iDreamPost
iDreamPost
సినిమా పరిశ్రమలో వారసత్వం ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక పెద్ద స్టార్ కొడుకో లేదా తమ్ముడో లేక ఇంకో కుటుంబ సభ్యుడో రావడం, సినిమాలు జనాల మీద వదలడం ఈమధ్య కాలంలో ఇంకా ఎక్కువయ్యింది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ అయితే ఖచ్చితంగా లేదు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. కేవలం బ్రాండ్ మీద జనం గుడ్డిగా ఆదరించరు. కొన్నిసార్లు దీనికి టైం పడితే ఒక్కోసారి కేవలం ఒకే ఒక్క సినిమాతో జాతకాలు తేలిపోతూ ఉంటాయి. అలాంటి కేసుల మీద ఓ లుక్ వేద్దాం.
అంకుశం, అల్లరి ప్రియుడు లాంటి వరస బ్లాక్ బస్టర్స్ తో రాజశేఖర్ మంచి ఫాం లో ఉన్న టైం అది . తన తమ్ముడు సెల్వాను టాలీవుడ్ కు పరిచయం చేయాలనిపించింది. 1994లో గ్యాంగ్ మాస్టర్ తో దీన్ని ప్లాన్ చేశారు. టాప్ మోస్ట్ డైరెక్టర్ గా ఫాంలో ఉన్న బి గోపాల్ తో పక్కా స్కెచ్ రెడీ చేశారు. రాజశేఖర్ హీరోగా కృష్ణంరాజు కీలక పాత్రలో సెల్వకో మంచి రోల్ ఇచ్చి సుబ్బరామిరెడ్డి లాంటి అగ్ర నిర్మాతతో సినిమా తీయించాడు. హిందీ సూపర్ హిట్ మూవీ నసీరుద్దిన్ షా ‘సర్’ కి రీమేక్ గా రూపొందిన గ్యాంగ్ మాస్టర్ ఫైనల్ గా పెద్ద డిజాస్టర్. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా కాపాడలేకపోయింది. దీని తర్వాత సెల్వ తనకు ముందే లైఫ్ ఇచ్చిన కోలీవుడ్ లో సెటిలైపోయాడు.
ఇంకో ఉదాహరణ చూద్దాం. పెళ్లి సందడితో ఒక్క దెబ్బకు స్టార్ రేస్ లోకి వెళ్ళిపోయిన శ్రీకాంత్ తన తమ్ముడు అనిల్ ను 1999లో తెరకు పరిచయం చేశాడు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన విజయ్ ‘కాదలిక్కు మరియాదై’ని తెలుగులో ‘ప్రేమించేది ఎందుకమ్మా’ పేరుతో రీమేక్ చేయించాడు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా మొదట్లో బాగానే అంచనాలు రేపింది. గులాబితో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న మహేశ్వరి హీరోయిన్. సో మొదటి రోజు మొదటి ఆట వరకు ఓపెనింగ్ బాగానే తెచ్చుకుంది. సినిమా మాత్రం దారుణాతి దారుణంగా బోల్తా కొట్టింది.
దెబ్బకు అనిల్ తో సినిమా తీసేందుకు ఇంకో నిర్మాత ముందుకు వస్తే ఒట్టు. నటన కూడా అంతంత మాత్రంగా ఉండటంతో శ్రీకాంత్ కూడా నిస్సహాయుడిగా మారిపోయి ఇంకేం చేయలేకపోయాడు. చిరంజీవి తమ్ముళ్లలో సైతం పవన్ కళ్యాణ్ స్టార్ అయ్యాడు కానీ అతని కన్నా ముందు పదేళ్ల క్రితం డెబ్యూ చేసిన నాగబాబు మాత్రం ఏ ప్రభావం చూపించలేకపోయాడు. కాకపోతే నాగబాబు హీరోగా ఓ పదిదాకా సినిమాలు వచ్చుంటాయి. కాని మెగా ఫ్యామిలీలో ఇతర వరసల్లో ఉండే హీరోలు మాత్రం సక్సెస్ అయ్యారు. దేనికైనా టైంతో టాలెంట్ కూడా కలిసి రావాలని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణలు అక్కర్లేదేమో