iDreamPost

చిన్న సినిమాల దారి అటువైపే

చిన్న సినిమాల దారి అటువైపే

ఇప్పట్లో కరోనా పంచాయితీ తేలేలా కనిపించకపోవడంతో చిన్న సినిమాల నిర్మాతలు మెల్లగా ఓటిటి దారి పడుతున్నారు. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా జనం వస్తారో రారో చెక్ చేయడానికి తమ చిత్రాలనే పణంగా పెట్టేందుకు వీళ్ళు సిద్ధంగా లేరు. దీని కన్నా డిజిటల్ సంస్థలు ఇస్తున్న డీల్స్ కి ఓకే చెప్పడమే నయమనే ఆలోచనలో ఉన్నారు. తాజా పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి. సత్య దేవ్ టైటిల్ పాత్రలో మలయాళం హిట్ మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని లాక్ డౌన్ కు ముందే ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది . అప్పుడు ఏప్రిల్ 17 విడుదల అనుకున్నారు.

కట్ చేస్తే లాక్ డౌన్ వల్ల మొత్తం ప్లాన్ మారిపోయింది. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా రూపొందిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఇందులో పార్ట్ నర్ గా ఉండటం హైప్ ని పెంచింది. కాని ఇప్పుడు ఓటిటి రిలీజ్ కే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు నవీన్ చంద్ర, సలోని లుత్రా జంటగా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ను సైతం ఆన్ లైన్లో రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ ని కూడా వెబ్ మూవీ అనే ప్రమోట్ చేస్తున్నారు. దీనికి సెన్సార్ అవసరం ఉండదు కాబట్టి ఆ ఫార్మాలిటీ కూడా తప్పింది. ఇంకొద్ది రోజుల్లో విడుదల తేదిని ప్రకటిస్తారు. ఇవి కాకుండా సుమారు ఐదారు సినిమాలు డిజిటల్ వైపే మొగ్గు చూపుతున్నాయి.

ఈ నెలలోనే అన్నింటికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. మొన్నటిదాకా అనుష్క నటించిన భారీ బడ్జెట్ మూవీ నిశబ్దం కూడా ఇదే తరహాలో వచ్చేస్తుందని అన్నారు కాని తర్వాత సైలెంట్ అయిపోయారు. మరోవైపు తమిళనాడులో ఒక్కొక్కటిగా చిన్నితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. జ్యోతిక మూవీ వీటికి దారి చూపించేసింది. టాక్ తో సంబంధం లేకుండా జనం వీటిని బాగానే చూస్తున్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ దాకా థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు కాబట్టి ఆలోగా అన్ని బాషల్లోనూ కలిపి ఓ ఇరవై దాకా సినిమాలు ఓటిటిలో సందడి చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలనుకునే నిర్మాతలు మాత్రం ఎంత లేదన్నా రెండు మూడు నెలలు వేచి చూడక తప్పదు మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి