iDreamPost

“వకీల్ సాబ్” పై ఒక ఎన్నారై మనోగతం

“వకీల్ సాబ్” పై ఒక ఎన్నారై మనోగతం

“వకీల్ సాబ్” పై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. పవర్ స్టార్ మళ్లీ తెరమీద కనపడుతుండటం కొందరికి సంతోషమైతే, కొందరు మాత్రం ఒక సీరియస్ సబ్జెక్ట్ ని డీల్ చేసే సినిమా పోస్టర్ మీద స్టార్ హీరో అహంభావం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని వాపోతున్నారు. అటువంటి అభిప్రాయాల్లో ఇదొకటి. అలేఖ్య బుద్ధరాజు అనే ఎన్నారై సోషల్ మీడియాలో చక్కని విశ్లేషణతో వ్రాసిన ఇంగ్లీషు పోస్టుకి యథాతథ తెలుగు అనువాదం ఇది. ఒక్క ఈ సినిమా గురించే అని కాకుండా తెలుగు ప్రేక్షకుల ప్రస్తుత టేస్ట్ ని తెలియజేస్తూ ఆలోచింపజేసే విధంగా వ్రాసారీమె. ఇక చదవండి:

“నేనెందుకు తెలుగు సినిమాల కంటే తమిళ & మలయాళ సినిమాలు చూసేందుకు నా సమయం వెచ్చిస్తాను అని మీరు మరోసారి అడిగితే

ఇదే నా సమాధానం!

‘పింక్’ ఎన్నో హృదయాలను తడిమిన సినిమా. ఓ పెద్ద స్టార్ హీరో కూడా తనలోని నటుడిని మాత్రమే బయటకు రానిచ్చి.. ఓ పెద్ద కాన్వాసుపై కుంచె గీసిన గీతలా తన పాత్రను పోషించి సినిమాలో ఎవరి చుట్టూ కథ అనేది తిరుగుతుందో వారికే అగ్రతాంబూలం ఇచ్చిన తదనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. స్క్రిప్ట్ విషయంలోనూ & వెండితెరపై కనిపించే విధానంలో మాత్రమే కాకుండా ప్రచార చిత్రాలలో కూడా అదే పంథాను పక్కాగా అనుసరించిన సినిమా.

అదే కోవలో తమిళ రీమేక్ ‘నేర్కొండ పార్వై'(సూటియైన చూపు/సరళ దృష్టి?) కూడా వచ్చింది. ఇందులో కూడా అదే స్థాయి ఉన్న స్టార్(వయసుతో వచ్చిన మార్పును ఎంతో హుందాగా నిజ జీవితంలో స్వీకరించినట్టే వెండితెరపై కూడా చూపించిన వారు) నటించి మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రానికి హిందీ స్టార్ చేసిన స్థాయిలోనే సరైన న్యాయం చేశారు.

ఇప్పుడు తెలుగు రీమేక్ వంతు. మహత్వోన్మాదంతో ఉన్న స్టార్ కు తగ్గట్టుగా & ఆయన అభిమానుల అహాన్ని సంతృప్తి పరిచేలా ఓ మతిలేని టైటిల్ & పోస్టర్ తో అసలు కథ ఎవరి చుట్టూ తిరుగుతుందో ఆ అమ్మాయిలను అసలు చిత్రంలో కనిపించనీకుండా చేసింది. ఒక అగ్ర కథానాయకుడి శరీరభాష & చిత్రమైన ప్రవర్తనను ఆయన వ్యక్తిగత & ప్రజా జీవితాన్ని దాటి తెలుగులో వేడుకలా జరుపుకునే విధానం అత్యంత ఆశ్చర్యకరం. అది మూలంలోని కథా గమనాన్ని & పాత్ర చిత్రణను అపహాస్యం చెయ్యడమే.

దీనివల్ల మరోసారి ఋజువయ్యే విషయం ఏంటంటే, ఇతరులు కళను సృజిస్తే మనమేమో ఒకరిని గొప్పగా చూపించుకునే ప్రచారానికి కళ అనే పేరును ఆపాదిస్తున్నాం. ఇతర పరిశ్రమల్లో నటులు కళకు సవినయంగా సలాం చేస్తున్నారు. మనకేమో ఇక్కడ స్వీయ ప్రాముఖ్యతకే పట్టం కట్టుకునే స్టార్లు వ్యాపారాన్ని శాసిస్తూ నియంత్రణ అనేది లేకుండా గర్వానికి పరాకాష్టలా ఉంటున్నారు.

ఒక సమాజ స్థాయి అక్కడి ప్రజలు పూజించే చిహ్నాలు/దేవుళ్ళలోనూ, వారు వేడుకలా జరుపుకునే కళలోనూ మరియు వారు ఆమోదించే కళావిధానాలలోనూ ప్రతిబింబిస్తుంది.

నా అభిప్రాయమిదే”.

ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ “జానీ” తర్వాత రియలిస్టిక్ టచ్ తో సినిమా చెయ్యలేదు. సబ్జెక్ట్ పరంగా వకీల్ సాబ్ కి అలా చేయగలిగే వెసులుబాటు ఉన్నా ఎందుకో ఫస్ట్ లుక్కులో మాత్రం స్టార్ డం నే చూపించారు. తదుపరి వచ్చే పోస్టర్స్ లో సీరియస్నెస్ ని జోడిస్తారేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి