iDreamPost

ట్రంప్ కు కోపం వస్తే ఇలాగే చేస్తాడు .. ఆందోళనలో డబ్ల్యూహెచ్ఓ

ట్రంప్ కు కోపం వస్తే ఇలాగే చేస్తాడు .. ఆందోళనలో  డబ్ల్యూహెచ్ఓ

అగ్రరాజ్యం అమెరికా అధిపతి డొనాల్డ్ జే ట్రంప్ కు కోపం వస్తే ఏమి చేస్తాడో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ)కు బాగా తెలిసివచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో చైనాపై ట్రంప్ కు బాగా కోపం ఉంది. అదే సమయంలో చైనాను వెనకేసుకొచ్చిని డబ్ల్యూహెచ్ఓ అంటే కూడా బాగా మండిపోతున్నాడు. చైనా నుండి వచ్చిన ముప్పుకన్నా డబ్ల్యూహెచ్ఓ వల్ల ప్రపంచానికి జరిగిన నష్టమే ఎక్కువని ట్రంప్ అభిప్రాయపడుతున్నాడు. అందుకనే అమెరికా నుండి డబ్ల్యూహెచ్ఓకి వెళ్ళే నిధులను నిలిపేస్తు నిర్ణయం తీసుకున్నాడు.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్వహణకు ప్రతి ఏడాది వివిధ దేశాలు నిధులను సమకూరుస్తుంటుంది. కాబట్టే డబ్ల్యూహెచ్ఓకు అన్నీ దేశాలను సమానంగానే చూడాల్సిన బాధ్యతుంది. ఒక దేశంలో ఎక్కడైనా సమస్య తలెత్తగానే వెంటనే రంగంలోకి దిగి సమస్య మూలాలతో పాటు పరిష్కారాన్ని కూడా కనుక్కుని ఇతర దేశాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా డబ్ల్యూహెచ్ఓపై ఉంది. అయితే కరోనా వైరస్ విషయంలో చైనా ప్రపంచదేశాలను అప్రమత్తం చేయలేదని ట్రంప్ మండిపోతున్నాడు.

వైరస్ విషయంలో చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా చాలా కాలంగా మౌనంగా ఉండటం వల్లే ప్రపంచదేశాలకు ముఖ్యంగా అమెరికా సమాజం ప్రమాదంలో పడిపోయిందని ఇప్పటికే చాలాసార్లు ఆరోపణలు చేశాడు. ప్రధానంగా తమ నిధులతో నడుస్తున్న సంస్ధ చివరకు తమనే ఇబ్బందులు పెట్టిందని ట్రంప్ భావనలో ఉన్నాడు. అందుకనే డబ్ల్యూహెచ్ఓ కు అమెరికా నుండి ప్రతి ఏడాది వెళుతున్న రూ. 3833 కోట్లను నిలిపేశాడు. డబ్ల్యూహెచ్ఓ తో పాటు ప్రపంచదేశాలు నిధులు నిలిపేసే విషయంలో ఎంత మొత్తుకున్నా ట్రంప్ పట్టించుకోలేదు.

అమెరికా సంవత్సరానికి రూ. 3833 కోట్లు ఇస్తుంటే చైనా మాత్రం రూ. 300 కోట్లనే ఇస్తోందట. వైరస్ తీవ్రత బయటపడగానే తాను చైనాతో పాటు ఇతర దేశాల నుండి ట్రావెల్ బ్యాన్ పెట్టాలన్న తన నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్ఓ తీవ్రంగా వ్యతిరేకించిన విషయంపై ట్రంప్ బాగా కోపంతో ఉన్నాడు. అమెరికాలో వైరస్ వ్యాప్తి విషయం ట్రంప్ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

వైరస్ ప్రభావం బయటపడిన వెంటనే అమెరికా క్షేమం కోరి ట్రావెల్ బ్యాన్ పెడితే డబ్ల్యూహెచ్ఓ చేయగలిగేది ఏమీ లేదు కదా. వైరస్ తీవ్రతను మొదట్లో ట్రంప్ చాలా తేలిగ్గా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ ప్రకటించమని ఎంతమంది చెప్పినా ట్రంప్ పట్టించుకోలేదు. అయితే పెరుగుతున్న తీవ్రతను చూసిన తర్వాత ట్రంప్ తో సంబంధం లేకుండానే కొన్ని రాష్ట్రాలు సొంతంగా లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఆర్ధిక అంశాలకు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ట్రంప్ ప్రజల ప్రాణాలకు ఇవ్వలేదనే ఆరోపణలు అమెరికాలోనే వినిపించాయి.

సరే ఏదేమైనా తనలోని లోపాలను ట్రంప్ అంగీకరించలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఆ కోపాన్ని డబ్ల్యూహెచ్ఓపై చూపించి నిధులు నిలిపేశాడు. సరే ఇపుడు డబ్ల్యూహెచ్ఓ ఏమి చేస్తుందన్నది వేరే విషయం. అందుకనే డబ్ల్యూహెచ్ఓకు అందిస్తున్న నిధులను తాము పెంచుతామని చైనా తాజాగా ప్రకటించింది లేండి. కాబట్టి చైనా బాటలోనే మిగిలిన దేశాలు కూడా ప్రయాణిస్తే అమెరికా నుండి ఆగిపోయిన నిధులు భర్తీ అవుతుందేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి