చంద్రబాబు గ్యాంబిట్ ఫలిస్తుందా??

రాజకీయాలను చదరంగంతో పోలుస్తారు. ఎత్తుకు పైఎత్తు వేయడం, ప్రత్యర్థి ఎత్తును ముందుగానే ఊహించి, దానిని చిత్తు చేసేలా ఎత్తులు వేయడం రెండింటిలోనూ ఉంటాయి. సమకాలీన రాజకీయాల్లో ఇలా ఒక ఆటలాగా రాజకీయం చేసే నాయకుల్లో ముందుగా చెప్పుకోవలసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎటువంటి ఆవేశ కావేశాలకూ లోను కాకుండా, వ్యక్తిగత మనోభావాలకు లోబడి నిర్ణయాలు తీసుకోకుండా తనకూ, తన పార్టీకీ ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయం తీసుకోవడంలో వారి తరువాతే ఎవరైనా!!

చదరంగంలో గ్యాంబిట్ (Gambit) అని ఒక ఆట ఆడే పద్ధతి ఉంది. ఇందులో ఒక ఆటగాడు తన పావుని ప్రత్యర్థికి ఎర వేస్తాడు. ప్రత్యర్థి ఆశపడి ఆ పావుని చంపితే, పావుని ఎర వేసిన ఆటగాడి ఆట మెరుగై, ఆటలో ఆధిక్యం సాధించి గెలుస్తారు. కొన్నిసార్లు ఈ ఎత్తు తిరగబడుతుంది. తను కోల్పోయిన పావుకి సమానమైన ఆధిక్యత ఆటలో రాక ఓడిపోవడం కూడా జరగవచ్చు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు ఇలాంటి ఆటే ఆడుతున్నారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు అమరావతిలో ఉండాలని తన సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. విశాఖపట్నంలో సచివాలయం వద్దనడం వల్ల ఉత్తరాంధ్రలో, కర్నూలులో హైకోర్టుకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడం వల్ల రాయలసీమలో వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కూడా సిద్ధపడి అమరావతి కోసం చావోరేవో తేల్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

అయితే ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఆయన పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా తయారయింది. అధినాయకుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్థానికంగా జనంలో తమమీద వ్యతిరేకత బలపడుతోందని వారు భయపడుతున్నారు. వారిలో ఎవరూ బహిరంగంగా చంద్రబాబు మీద అసమ్మతి వ్యక్తం చేయలేదు.

ఈ అమరావతి పరిరక్షణ పోరాటంలో చంద్రబాబుకి ఇబ్బందికరంగా తయారయిన అంశాల్లో మొదటిది ఆ చుట్టుపక్కల తప్ప మిగిలిన రాష్ట్రంలో ఎవరూ ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం. రాజధాని రైతులు, రైతుకూలీలు కొందరు అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించడం కూడా చంద్రబాబు పోరాటాన్ని నీరుకార్చే విషయమే.

అన్నిటికన్నా ముఖ్యంగా రాజధాని పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి బినామీలు చేసిన ఇన్ సైడర్ ట్రేడింగ్ సాక్ష్యాధారాలతో సహా బయటపడడం, దాని మీద ప్రభుత్వం శరవేగంగా విచారణకు సిద్ధమవడం అమరావతి మీద చంద్రబాబు చూపిస్తున్న ప్రేమ వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు రాజధాని చుట్టుపక్కల ఉన్న ఆ ఇరవై తొమ్మిది గ్రామాల వాసులు కూడా పోరాటానికి వెనుకాడితే చంద్రబాబు నిర్ణయం పార్టీకి నష్టం కలిగించేది అవుతుంది. అలా కాక ఏదైనా అద్భుతం జరిగి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం వెనక్కి తీసుకుంటే చంద్రబాబు ప్రతిష్ట, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మెరుగవుతాయి.

వీటిలో ఏది జరగబోతోందో రానున్న కొద్ది రోజుల్లో తేలబోతుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే!

Show comments