Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ స్పష్టమైన వైఖరితో ముందుకెళుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ, అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని టీడీపీ భిన్నమైన స్టాండ్ తీసుకున్నాయి. జనసేన అధినేత అమరావతికి మద్ధతుగా నిలవగా.. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం మూడు రాజధానులకు జై కొట్టారు. రాష్ట్ర బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయి.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా.. జాతీయ నాయకత్వం మాత్రం రాష్ట్ర రాజధానిగా అమరావతియే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఇటీవల ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని బీజేపీ చెప్పిన తర్వాతనే తాను పొత్తు పెట్టుకున్నానని ఈ రోజు అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో పవన్ చెప్పారు.
బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చిందని చెబుతున్న జనసేన అధినేత అదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరంటూ సామాన్యప్రజలకు అందని తర్కాన్ని చెప్పారు. బీజేపీ రాజకీయ పార్టీ అని.. దాని మద్దతు రాజధాని అమరావతికి ఉంటుందని పవన్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు ఈ విషయంలో ఏమీ మాట్లాడబోరని అదే సమయంలో చెబుతూ.. రైతులను తికమకపెడుతున్నారు. పవన్ కళ్యాన్ ఏమి చెబుతున్నారో అర్థంగాక రైతులు తలలు పట్టుకుంటున్నారు.
బీజేపీ, జనసేన మధ్య పొత్తులో భాగంగా జరిగిన చర్చలు, హామీలను పవన్ కళ్యాణ్ వెల్లడిస్తూ రాజకీయ వేడిపుట్టిస్తున్నారు. అమరావతియే రాష్ట్రరాజధానిగా ఉంటుందని బీజేపీ హామీ ఇచ్చిన తర్వాతే తాను పొత్తు పెట్టుకున్నానని పవన్ కళ్యాన్ చెప్పడంపై బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.