iDreamPost
iDreamPost
ఆయనేమో భారతీయ జనతా పార్టీలో ప్రజా సేవ చేస్తుంటే.. ఈయనేమో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. ఆయన ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు..ఈయన ఈ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు.. ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. ప్రజలు మాత్రం తండ్రీ కొడుకుల కన్‌ఫ్యూజన్ మాటల రాజకీయం గురించి చర్చించుకుంటున్నారు.
రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా కేంద్రంలో సీనియర్ నాయకులు టి.జి వెంకటేష్,ఆయన కుమారుడు టి.జి భరత్‌లు చెరో పార్టీలో కొనసాగుతుండటం గురించే ఈ చర్చంతా.. టి.జి వెంకటేష్ భారతీయ జనతా పార్టీలో ఉంటే.. టి.జి భరత్ మాత్రం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు.2019 శాసనసభ ఎన్నికలలో టిడిపి కర్నూలు అభ్యర్థిగా టి.జి భరత్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.ఎన్నికల ఫలితాల అనంతరం వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి పార్టీలో టి.జి వెంకటేష్ చేరారు.
అంతకుముందు 2014 శాసనసభ ఎన్నికల్లో టి.జి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న టి.జి వెంకటేష్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడంతో ఆ పార్టీలోనే కొనసాగారు.ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన టి.జి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ తరుపున రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి,తర్వాత టిడిపిలో చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి,టి.జి భరత్‌లు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కర్నూలు టికెట్ కోసం పోటీ పడినప్పటికీ చంద్రబాబు చివరి నిమిషంలో టి.జి భరత్‌కు సీటిచ్చాడు.దీంతో అనుచరుల కోరిక మేరకు ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరి ఎలాంటి షరతులు పెట్టకుండా తమ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేశారు.మొన్నటి ఎన్నికల్లో కుమారుడు టి.జి భరత్ ఓటమి అనంతరం వ్యాపార ప్రయోజనాలు కోసం టి.జి వెంకటేష్ కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడే అసలు కథ మొదలైంది.టి.జి వెంకటేష్ బీజేపీలో చేరినప్పుడు(రాజకీయ రంగప్రవేశం చేసిన 1999 నుంచి నేటి వరకు అధికారపార్టీలో ఉండటం ఈయనకే చెల్లింది ) కొడుకు టిజి భరత్ కూడా కచ్చితంగా పార్టీ మారతారని అంతా అనుకున్నారు.అయితే భరత్ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలలో టి.జి వెంకటేష్ బీజేపీకి సపోర్టు చేస్తే.. భరత్ టిడిపికి సపోర్టు చేస్తున్నారు.పార్టీల పరంగా ఇద్దరు తమ పార్టీలకు న్యాయం చేస్తున్నామని చెబుతున్నారు. మొన్నీమధ్య ఒకట్రెండు సార్లు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో భరత్ పాల్గొనలేదు.దీంతో వెంటనే ఈయన కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న చర్చ సాగింది.అయితే టిడిపిలోనే ఉన్నానంటూ భరత్ క్లారిటీ ఇచ్చినప్పటికీ పార్టీ క్యాడర్ ఆయన వ్యవహార శైలితో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.తండ్రి దగ్గర ఉండాలో కొడుకుతో పాటు ముందుకు సాగాలో అర్థం కాని అయోమయ పరిస్తితిలో ఉన్నామంటూ పలువురు అనుచరులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా రాష్ట్ర రాజధాని మార్పు విషయంలో వైసీపీ ప్రభుత్వం పాలనా రాజధానిని విశాఖలో పెడతామని చెబుతుంటే ఈ తండ్రీ కొడుకుల వాదన భిన్నంగా ఉంది.తండ్రి టి.జి వెంకటేష్ మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించి కర్నూలులో హైకోర్టుతో పాటు మిని సెక్రటేరియేట్ కూడా ఏర్పాటుచేస్తే రాయలసీమ ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు.అయితే కొడుకు టి.జి భరత్ మాత్రం రాజధానిని మారిస్తే చూస్తూ ఊరుకోం అంటూ,అమరావతిలోనే రాజధాని కొనసాగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాటనే తన పాటగా పాడుతున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా తండ్రో మాట,కొడుకో మాట రాజధాని విషయంపై మాట్లాడటం గురించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది.