iDreamPost
iDreamPost
సినిమా తారలు ఇళ్లకే పరిమితం కావడంతో వాళ్ళ కొత్త సినిమా కబుర్లు లేక అభిమానులకు లాక్ డౌన్ పీరియడ్ యమా డల్ గా సాగుతోంది. ఎప్పుడైతే రియల్ మ్యాన్ ఛాలెంజ్ పేరిట అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా సోషల్ మీడియా వేదికగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టాడో ఇక అప్పటి నుంచి ఒకరి నుంచి ఒకరికి ఇది చెయిన్ లా మారుతూ మంచి వినోదాన్ని పంచుతోంది. ట్విట్టర్ ని ప్లాట్ ఫార్మ్ గా చేసుకుని ఇప్పటిదాకా ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, కొరటాల శివ, రాజమౌళిలు పాల్గొనగా నెక్స్ట్ నాగార్జున, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు.
వీళ్ళు మళ్ళి ఎవరెవరిని ట్యాగ్ చేస్తారో అలా వాళ్ళ నుంచి ఇంకో ముగ్గురికి లేదా నలుగురికి స్టాలిన్ ఫార్ములా టైపులో కొనసాగుతుందన్న మాట. ఇవాళ చిరంజీవి ఇంటి పనులు చేస్తూ అమ్మకు ఉప్మా పెసరట్టు స్వయంగా వేసి తినిపించిన అప్పుడే వైరల్ గా మారిపోయింది. ఫ్యాన్స్ ఎమోషనల్ గానూ దీంతో బాగా కనెక్ట్ అవుతున్నారు. వెంకీ మామ ఇందాకే పోస్ట్ చేశారు. మహేష్ బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిలను ట్యాగ్ చేశారు . లాక్ డౌన్ టైంలో ఇదోరకమైన టైం పాస్ అనే చెప్పొచ్చు. ఈ పనులన్నీ వీళ్ళు నిజంగా రోజూ చేస్తున్నారా లేక ఒక్క వీడియోకె పరిమితమవుతోందా అనే ఆలోచన అప్రస్తుతం.
కానీ నిజంగా వీళ్ళ నుంచి సదరు అభిమానులు స్ఫూర్తి పొంది ఇంట్లో ఆడవాళ్లకు రెస్ట్ ఇస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది. ఇప్పుడు మహేష్ బాబు, అక్కినేని నాగార్జున వీడియోలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ మొదలైంది. ఎవరికి వారు తమ ప్రత్యేకతను చూపిస్తున్నారు. ఇంకా రియల్ విమెన్ అని ఎవరూ ట్రెండ్ ని స్టార్ట్ చేయలేదు. అదే జరిగితే హీరోయిన్లు కూడా బరిలో దిగుతారు. వీళ్లూ హీరోలతో సమానంగా కష్టపడే వాళ్లే కాబట్టి వీటికి కూడా స్పందన బాగానే ఉంటుంది. చూద్దాం రియల్ మ్యాన్ ఛాలెంజ్ ఈ చైన్ ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో