Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ స్థానిక రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్ధతుగా ఈ నెల 2న జనసేన చేపట్టాలనుకున్న ర్యాలీ వాయిదా పడడానికి గల కారణాలను ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ రోజు రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ రాజధానిగా అమరావతే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎవరు ఉన్నా లేకపోయినా.. తాను చివర వరకూ రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ర్యాలీకి జాతీయ స్థాయి నేతలు వచ్చేందుకు వీలుగా వాయిదా వేశామని పవన్ తెలిపారు. ఢిల్లీ ఎన్నికలు ఉండడంతో బీజేపీ నేతలు వచ్చేందుకు అవకాశం లేకపోయిందని, అందుకే వాయిదా వేశామన్నారు. త్వరలో ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు.
రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని చెప్పిన పవన్ కళ్యాణ్.. రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా సమర్థించారని పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని బీజేపీ తనకు చెప్పిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ తర్వాతనే బీజేపీతో తాను పొత్తుపెట్టుకున్నానని చెప్పారు. రాజధానిపై బీజేపీ మాట్లాడుతుందిగానీ కేంద్రప్రభుత్వం మాట్లాడబోదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా మాట్లాడాలని రైతులు ఆశించవద్దని సూచించారు.