పవన్ సినిమా ఓటిటి రిలీజ్ : ఇది క్లారిటీ

ఇటీవలే జరిగిన రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ తాలూకు పరిణామాలు ఎక్కడికో దారి తీస్తున్నాయి. రాజకీయ స్పందనల సంగతి కాసేపు పక్కనపెడితే ఇప్పుడీ నిర్మాతలు రిలీజ్ కు సంబంధించి కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. డైరెక్ట్ ఓటిటికి ఇస్తే కనక ఎంత ఆఫర్ వస్తుందనే కోణంలో సదరు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని కొన్ని మీడియా వర్గాలు ఉటంకిస్తున్నాయి. టక్ జగదీష్, నారప్ప లాంటి మీడియం రేంజ్ చిత్రాలకే 40 కోట్ల దాకా ఆఫర్ చేసినప్పుడు పవర్ స్టార్ మూవీకి దానికి రెట్టింపు కన్నా ఎక్కువే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి ప్రచారాలు కూడా ఈమధ్య కామన్ అయ్యాయి.

థియేటర్లు ప్రస్తుతానికి కుదుటపడుతున్నాయి కానీ పూర్తిగా కుదుటపడటానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ కనక ముందు ప్రకటించిన జనవరి 12కి వస్తే ఆశించిన వసూళ్లు వస్తాయా రావా అనే అనుమానం రావడం సహజం. అందులోనూ భారీ పోటీ ఉంది. రాధే శ్యామ్, సర్కారు వారి పాట స్ట్రెయిట్ సినిమాలు కాగా పవన్ మూవీ ఆల్రెడీ వేరే బాషల చిత్రాలు వీక్షించే అలవాటున్న మూవీ లవర్స్ చూసేసిన అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్. సో ఎంతో కొంత రిస్క్ లేకపోలేదు.అయితే నిర్మాత నాగవంశీ ఇందాకే ట్వీట్ చేస్తూ భీమ్లా నాయక్ థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇవ్వడం కొసమెరుపు.

ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. నవంబర్ లోగా మొత్తం పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. రానా మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో నిత్య మీనన్ ఒక హీరోయిన్ కాగా ఐశ్వర్య రాజేష్ తప్పుకుందనే వార్త వచ్చింది కానీ దానికి సంబంధించిన క్లారిటీ రావడం లేదు. తమన్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ ఇప్పటికే హిట్ అయ్యింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచనలో రూపొందుతున్న ఈ ఈగో క్లాష్ ఎంటర్ టైనర్ మీద అభిమానులు మాత్రం బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ ఓటిటి ప్రచారం ఖండించేశారు కానీ ముందు ముందు ఊహించని ట్విస్ట్ ఏదైనా ఉంటుందేమో మరి

Also Read : రాజమౌళి త్వరపడక తప్పదు

Show comments