రవితేజ ‘క్రాక్’కి కావాల్సింది అదే

బాక్స్ ఆఫీస్ వద్ద తన స్థాయి హిట్టు కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా క్రాక్ కరోనా వల్ల విడుదల బ్రేక్ వేసుకోవాల్సి వచ్చింది . షూటింగ్ దాదాపు పూర్తయిపోయి మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న తరుణంలో ఇలా ఆగిపోవడం అభిమానులకు షాకే. అయితే ఈ పరిస్థితి చిన్నా పెద్ద అందరికి వచ్చింది కాబట్టి ఈ గండం నుంచి త్వరగా బయటపడేయమని దేవుణ్ణి వేడుకోవడం తప్ప ఇంకేమి చేయలేని టైం ఇది.

సరే లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. థియేటర్లకు షూటింగులకు మినహాయింపు ఇస్తారా లేదా అనేది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాతలు సైతం ఆగస్ట్ దాకా సినిమా హాళ్ళు ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పడం చూస్తే సిచువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ నేపధ్యంలో అంతా క్లియర్ అయ్యాక డేట్ ని సెట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్ గా మారబోతోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న క్రాక్ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తనకు బాగా అచ్చి వచ్చిన పాత్ర కావడంతో పాటు ఇందులో డిఫరెంట్ మ్యానరిజం పెట్టినట్టు టీజర్ లోనే అర్థమైపోయింది.

ఈ కరోనా గోల ఎలా ఉన్నా క్రాక్ టీం ప్రమోషన్ ని కొనసాగించే నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆడియోలోని ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా గ్యాప్ తీసుకుని వచ్చేస్తాయి. ఒకవేళ జూలైలో హాళ్ళు ఓపెన్ అవుతాయనుకుంటే ఇప్పటికే వాయిదాలు పడి క్యులో ఉన్న వి, నిశబ్దం, ఉప్పెన, అరణ్య, రెడ్ ల తర్వాతే క్రాక్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి డేట్ డిసైడ్ చేయాల్సి రావొచ్చు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సముద్రంలో కొందరు చేపలు పట్టే వాళ్ళ క్రైమ్ ని ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు. వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరఖని విలన్లుగా నటించడం హైప్ ని పెంచుతోంది.

Show comments