iDreamPost
iDreamPost
అక్కడ ఉన్నది పది వార్డులు.. గెలిచింది స్వతంత్రుడితో కలుపుకొని ఏడు పార్టీలు…
“అమరచింత” పాత సంస్థానం ..2009 పునః విభజనలో ఈ నియోజకవర్గం రద్దు అయ్యి కొత్తగా దేవరకద్ర ఏర్పడింది. కానీ అమరచింత మండలం మక్తల్ నియోకవర్గంలో కలిసిపోయింది.
అప్పట్లో అమరచింత అంటే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నంతగా ఆయన ఆధిపత్యం ఉండేది. కొత్త కోట దయాకర్ రెడ్డి పూర్వికులు అమరచింత సంస్థాన్ దివాన్ గా ఉండేవారు.
అమరచింత నుంచి దయాకర్ రెడ్డి టీడీపీ తరుపున 1994,1999లో గెలిచి 2004లో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో దయాకర్ రెడ్డి మక్తల్ నుంచి ,ఆయన శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి దేవరకద్ర నుంచి గెలిచారు. తెలంగాణా ఆవిర్భావం తరువాత కూడా కొత్త కోట దంపతులు టీడీపీలోనే కొనసాగటంతో టీడీపీ అస్తిత్వం కోల్పోవటంతో దయాకర్ రెడ్డి రాజకీయంగా దెబ్బతిన్నాడు. 2014,2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు సీతా దయాకర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు.
ఈ రోజు వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అమరచింత మున్సిపాలిటీ ఓటర్లు ఆశ్చర్యకరమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 10 వార్డులకుగాను టిఆర్ఎస్-3,సిపిఎం-2,బీజేపి-1,కాంగ్రేస్-1,టీడీపీ- 1,సీపీఐ- 1,ఇండిపెండెంట్-1 గెలిచారు.అంటే పది వార్డులకు గాను ఏడు పార్టీలకు ప్రాతినిధ్యం దక్కినట్లు.. ఇంతటి వైవిధ్యమైన ప్రజా తీర్పును గతంలో చూడలేదు…
ఫలితాలు విడులయిన వెంటనే ఆలస్యం చేయకుండా స్థానిక తెరాస మరియు సిపిఎం నాయకత్వం ఒక అవగాహనకు వచ్చి
మున్సిపల్ చైర్మన్ గా టిఆర్ఎస్ అభ్యర్థి మంగమ్మ నాగభూషణం గౌడ్ ను , వైస్ చైర్మన్ గా సిపిఎం కు చెందిన GS గోపి ని ఎన్నుకున్నారు. ఈ కూటమికి సిపిఐ మద్దతు ఇచ్చింది..
స్థానిక రాజకీయాలను రాష్ట్ర పార్టీలు పూర్తిస్థాయిలో నియంత్రించలేవు .. తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో తెరాస, సిపిఎంల మధ్య నిత్య వైరం ఉంది .కానీ స్థానిక పొత్తులను రెండు పార్టీలు నిరోధించే పరిస్థితి లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఒక్కసారి కూడా గెలవని ఏకైక జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్… అంటే కమ్యూనిస్టు పార్టీల తరుపున మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏ ఒక్కరు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. కానీ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాభవం ఉంది.
నేడు విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట హంగ్ వచ్చింది.. అనేక చోట్ల విచిత్రమైన పొత్తులకు తావు ఇచ్చింది..