Idream media
Idream media
అన్ని కులాల్లో వెనుకబడిన ఉపకులాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రత్యేకంగా బీసీలకు అగ్రపీఠం వేస్తూ 1980 దశకంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1990 దశకం మధ్యనుండి పూర్తిగా కులముద్ర వేసుకుంది. ఆ పార్టీ రాజకీయాలు, వాటి మద్దతుదారులు ఒకే సామాజికవర్గం చుట్టూ తిరుగుతూ ఉండడంతో టిడిపిని ప్రజలు అలా ఓ కులం వైపు నెట్టేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ పార్టీని సమాజంలోని మిగతా అన్నికులాలు మరింత దూరం నెట్టేశాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు అమరావతిని మార్చాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా నడుస్తుంటే టీడీపీ కానీ, టీడీపీ మీడియా కానీ అమరావతి తరలింపును నిలిపేందుకు చాలా బలంగా పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మీడియా బలం చాలకో ఏమో సోషల్ మీడియాలో కూడా అమరావతికి అనుకూల ప్రచారం విస్తృతం చేస్తోంది.
అమరావతి నిలుపుకునే ప్రయత్నంలో ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం బహిరంగంగానే జరుగుతోంది. ఓవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలను రాజధాని తరలింపుతో ఏదో కోల్పోతున్న వారీగా చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పోరాటాల పురిగడ్డలో పోరాటాలు అంతరించాయా? పౌరుషం చచ్చిపోయిందా ? అంటూ భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో రాయలసీమ వాసులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని హక్కు మీదికదా? మీరెందుకు అడగరు? రాయలసీమ పౌరుషం ఏమైంది? అంటూ వారిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. రాజధాని అంగుళం కూడా కదలనీయం అంటూ నినాదాలిచ్చే ఆ పార్టీ, ఆ సామాజిక వర్గం, వారి మీడియా ఇలా రాయలసీమ వాసులను అడగడంలో లక్ష్యం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మినహా ఇంకోటి కాదు. రాజధాని అమరావతి నుండి అంగుళం కూడా కడపనివ్వం అంటూనే మరోవైపు రాయలసీమ వాసులను ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంలో ప్రాంతీయవాదం రెచ్చగొట్టడం మినహా మరో లక్ష్యం కనిపించడం లేదు.
గత మూడు రోజులుగా టీడీపీ అనుకూల మీడియా పెద్దఎత్తున అమరావతిలో ఉన్న వసతుల గురించి, విశాఖపట్నం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎంతదూరం వంటి అంశాలు ఏకరువు పెడుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినట్టు విజయవాడకు విశాఖపట్నం 400 కిలోమీటర్ల దూరం అని బెజవాడ వాళ్ళు బాధపడితే విశాఖపట్నం వారికి అమరావతి 40 కిలోమీటర్ల దూరమే ఉంటుందా? వారికి కూడా 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా? ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు ఈ మీడియా? ఇప్పుడు అమరావతిలో, విజయవాడలో గత నాలుగేళ్ళలో ప్రభుత్వం నిర్మించిన భవనాల లెక్కలు తీసి రాజధాని తరలిస్తే ఇవన్నీ మట్టిలో కలిసిపోవాల్సిందేనా అని ప్రశ్నిస్తోంది. అయితే రాష్ట్రం విడిపోయి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పుడు అక్కడ మనకు కేటాయించిన భవనాలు మట్టిలో కలిపేసి విపరీతమైన అద్దెలు చెల్లిస్తూ ఇన్నేళ్ళుగా విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు నిర్వహించినట్టు? ఇక్కడ భవనాలు సిద్ధం కాకముందే హైదరాబాద్ భవనాలు ఎందుకు ఖాళీ చేసినట్టు? ఈ ప్రశ్నలు కుల మీడియా అడగదు. ఎందుకంటే ప్రజలను తప్పుదారి పట్టించి రెచ్చగొట్టడమే లక్ష్యం.
రాజధాని అమరావతిలో 29 గ్రామాల్లో 29 వేలమంది రైతులు 33 వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇచ్చారు అని చెపుతున్న టీడీపీ నేతలు, టీడీపీ మీడియా, 29 వేలమంది రైతులు ఎక్కడ నిరసనలో పాల్గొంటున్నారో చెప్పదేం? కుటుంబానికి ఇద్దరు చొప్పున రోడ్డుమీదకు వచ్చినా 58 వేలమంది రోడ్డుమీద ఉండాలి. ఎంతమంది ఉద్యమంలో ఉంటున్నారు? బయటనుండి, పార్టీ కార్యకర్తలు ఎంతమంది వస్తున్నారు? ఈ ప్రశ్నలు కుల నేతలు, కుల మీడియా అడగదు, చెప్పదు. రైతులు కుటుంబాలతో, అంటే పిల్లలతో సహా ఉద్యమం చేస్తున్నారు అని చెపుతున్న మీడియా, కొందరు ఆడపిల్లలను కూడా చూపిస్తున్న మీడియా 29 వెలరైతు కుటుంబాలనుండి పిల్లలు కూడా రోడ్డుమీదకు వస్తే అది ఎంత భారీ ఉద్యమం అవుతుందో ఎందుకు లెక్క చెప్పడం లేదు?
ఇప్పుడు తాజాగా మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా టీడీపీ , టీడీపీ మీడియా మొదలు పెట్టింది. రెండు రోజుల కిందట రాజధాని గ్రామాల నుండి మహిళలు విజయవాడలోని కనక దుర్గ దర్శనానికి రావడానికి ఒక కులపెద్దలు పిలుపు ఇచ్చారు. ప్రధాని శంఖుస్థాపన చేసిన ప్రదేశం నుండి మహిళల ప్రదర్శన దుర్గ గుడివైపు వస్తుంది. ఇది నిరసన ప్రదర్శన అంటారా లేక భక్తుల పర్యటన అంటారా? ఈ ప్రదర్శనలో ఉద్యమ రూపం ఉందా లేక భక్తి రూపం ఉందా? అలాంటి ప్రదర్శనకు అనుమతి లేదు అని పోలీసులు చెప్పగానే “హిందువులపై నియంత్రణ”, “అమ్మవారిని దర్శించుకోనివ్వని క్రీస్తు ప్రభువు భక్తుడు” అంటూ ప్రచారం చేయడంలో వీరి లక్ష్యం ఏమిటి? సాధారణ భక్తులను దుర్గ గుడికి పోనివ్వకుండా ప్రభుత్వం, పోలీసులు నిలిపివేస్తున్నారా? దుర్గగుడిని మూసేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడా? ఇలాంటి ప్రచారం మతవిద్వేషం రెచ్చగొట్టడం కాదా?
ఉద్యమం ఏరూపంలో చేసినా అమరావతిలో తాము పెట్టిన పెట్టుబడులు కాపాడుకోవడానికే అన్నది వాస్తవం. చంద్రబాబును నమ్మి అనేకమంది అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. గత ఆరు, ఏడు దశాబ్దాలుగా రాజధానులుగా ఉన్న నగరాల్లో లేని ధరలను మొదలే లేని అమరావతిలో చూపించిన రియల్ ఎస్టేట్ పెద్దలు ఇప్పుడు తమ పెట్టుబడులు ఏమవుతాయో అన్న భయంతో ఏకమవుతున్నారు. ఈ పెట్టుబడులు పెట్టిన వాళ్ళలో ఎక్కువమంది ఒక పార్టీ వాళ్ళే. ఒక కులం వాళ్ళే అన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు ఉద్యమం ,రోడ్డుమీద పోరాటం చేస్తున్నావారిలో ఒకే వర్గాన్ని చెందిన వారి కనిపిస్తున్నారు. ఒక టీడీపీ మీడియా మాత్రమే గోరంతలు కొండంతలుగా చూపిస్తోంది.ఆ పార్టీకి అనుయాయులుగా ఉన్న ఇతరకులాల నేతలు కొందరు అక్కడక్కడా కనిపిస్తున్నారు.