iDreamPost

జగన్ 2.0 స్టార్ట్..!

జగన్ 2.0 స్టార్ట్..!

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయి రెండో ఏడాది లోకి అడుపెట్టి 20 రోజులు దాటింది. మొదటి ఏడాదిలోనే ఊహకందని సంక్షేమ పథకాలను అమలు చేసి ముఖ్యమంత్రి జగన్ నూటికి నూరు శాతం మార్కులు పొందారు. లాక్ డౌన్ కాలంలోనూ ఇటు కరోనా నేపథ్యంలో చర్యలు చేపడుతూనే.. అటు పాలనా పరమైన నిర్ణయాలు అమలు చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ 5.0 సడలింపులు మొదలైనప్పటి నుంచీ.. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై దృష్టి సారించారు. మొదటి ఏడాదిలోనే 90 శాతం హామీలు పూర్తి చేసిన జగన్… ఇక రెండో ఏడాదిలో చేయాల్సిన పనులపై దృష్టి పెట్టారు.

గతంలోనే ఏడాది సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఆయన.. ఒక్కక్కటి అమలు చేస్తూ వెళ్తున్నారు. జగనన్న చేదోడు – వాధోడు, వాహన మిత్ర వంటి పథకాల ద్వారా.. ఇప్పటికే చాలా మందికి జగన్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. తాజాగా మరో పథకం అమలు చేయనుంది. పేద కాపు మహిళలను ఆర్ధికంగా ఆదుకోనున్నారు. అర్హులైన పేద మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఐదేళ్ళలో వారికి రూ.75 వేల రూపాయల సహాయం అందిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 2.36 లక్షల మహిళలకు లబ్ది పొందుతారు. ఈనెల 24న జగన్ ఈ పథకం ప్రారంభిస్తారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది.

రెండో ఏడాది (2.0)లో..

మొదటి ఏడాది ప్రజా పాలనలో విభిన్నతని చూపిన జగన్.. ఇక రెండో ఏడాదిలో మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించడం పై దృష్టి పెట్టారు. ఒకవైపు కరోనా కట్టడికి అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే… నియోజక వర్గాల అభివృద్ధికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రోజుకు పది మంది ఎమ్మెల్యేల కు అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. కరోనాతో ఆయా నియోజక వర్గాల్లో ఏర్పడిన పరిస్థితులు, స్దానిక అభివృద్ధికి కావల్సిన ఆర్థిక అవసరాలు, నిధులు, ప్రాధాన్యత పరంగా సమస్యల పరిష్కారం, నియోజక వర్గాల్లో పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. అభివృద్ధికి కరోనా అడుతగలకుండా.. తగిన వ్యూహం రచించి రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు అంశాలపై ఢిల్లీ పెద్దల తో ఫోన్ల ద్వారా సంభాషిస్తూ.. రాష్ట్రానికి కావల్సిన కేంద్ర సహాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జగన్ 1.0 ( మొదటి ఏడాది) లో సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడైనా, ఏమైనా ఆటంకాలు కలిగి ఉంటే… 2.0 ( రెండో ఏడాది) లో వాటిని అధిగమించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలకు చెక్ పెడుతూ… మరో వైపు కరోనాను కట్టడి చేస్తూ.. ఇంకో వైపు 2.0 పై ప్రధాన దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే లతో మీటింగ్ లలో కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి