iDreamPost

సినిమా థియేటర్లకు ఛాన్స్ లేదా

సినిమా థియేటర్లకు ఛాన్స్ లేదా

మూవీ లవర్స్ కు ఇంకొన్ని బ్యాడ్ డేస్ తప్పేలా లేవు. వచ్చే నెల నుంచి థియేటర్ గేట్లు తెరుచుకుంటాయేమోనని ఆశపడుతున్న ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చేలా సర్కారు నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కొంత సానుకూలతతో ఉన్నప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం జనసాంద్రత ఎక్కువగా ఉండే హైదరాబాద్ లాంటి నగరాల్లో రిస్క్ తీసుకునే ఉద్దేశంతో లేనట్టుగా తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే ఏపిలో హాళ్లు తెరుచుకున్నా లాభం ఉండదు.

ఇటీవలే ఓ మీడియా గ్రూప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఇంకో రెండు మూడు నెలల వరకు సినిమా హాళ్లను తెరిపించే ఆలోచన లేదని, పరిస్థితి తీవ్రంగా ఉన్నందు వల్ల కఠినమైనా ఈ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ఖరారుగా కాదు కానీ చెప్పిన మాటలను బట్టి ఆ దిశగానే చర్యలుంటాయని చెప్పనక్కర్లేదు. అందులోనూ ఇలాంటి భయానక వాతావరణంలో జనం సినిమాలు చూసే మూడ్ లో లేరు కాబట్టి నిర్మాతలు కూడా ఈ కోణంలో ఆలోచించాలని కోరారు. మల్టీ ప్లెక్సులు, కొందరు సింగల్ స్క్రీన్ యజమానులు లిమిటెడ్ సీట్లు, శానిటైజేషన్ లాంటి ఏర్పాట్లు చేయడానికి సుముఖంగా ఉన్నప్పటికీ అధిక శాతం నుంచి మాత్రం ఇవి తమ వల్ల కావనే అంటున్నారట. కాబట్టి ఒక చోట మినహాయింపు ఇచ్చి మరో చోట రిస్క్ చేయలేమనే ఉద్దేశం ఆయన మాటల్లో కనిపిస్తోంది.

ఇది నిజమే. ఇప్పటికిప్పుడు జనం తండోపతండాలుగా వస్తారన్న గ్యారెంటీ లేదు. పోనీ మా సినిమా ముందు రిలీజ్ చేస్తామని ఎవరూ ధైర్యంగా ప్రకటించడం లేదు. లాక్ డౌన్ అయ్యాక కొద్దివారాలు వేచి చూద్దాం అనే ధోరణిలోనే అందరున్నారు. కాబట్టి దసరా దాకా ఆశలు పెట్టుకోకపోవడం మంచిదనిపిస్తుంది. జులైలో ఓ మూడు సినిమాలు టెంటెటివ్ గా డేట్స్ అనుకున్నప్పటికీ అమలులో ఇది జరిగే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఓవర్సీస్ లోనూ పరిస్థితి కుదుటపడలేదు. స్టార్ హీరోల సినిమాల రెవిన్యూలో కీలక భాగం దానిదీ ఉంటుంది. మంత్రి గారి మాటే కాదు వాస్తవంగా కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు కూడా థియేటర్లకు వెళ్లే దారులను ఇప్పటికిప్పుడు తెరిపించేలా కనిపించడం లేదు. కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి గ్రీన్ జోన్లు పెరిగితే అప్పుడు పాజిటివ్ గా ఆలోచించవచ్చు. అప్పటిదాకా ఎదురు చూపులు తప్పవు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి