iDreamPost

అప్పటి హీరోయినే ఇప్పటి సిస్టరా

అప్పటి హీరోయినే ఇప్పటి సిస్టరా

మెగాస్టార్ చిరంజీవితో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లలో ఒకరు గా పేరు తెచ్చుకున్న సుహాసిని గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కలిసి నటించిన మంచుపల్లకి, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, చంటబ్బాయి లాంటి ఎన్నో సూపర్ హిట్స్ మర్చిపోలేని విజయాలను అందించాయి . ఇప్పటికీ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో తరచుగా జరిగే వేడుకల్లో చూస్తూనే ఉంటాం. ఈ కాంబోలో సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడీ కలయిక మళ్ళీ సాధ్యం కాబోతోందని ఫిలిం నగర్ టాక్. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే లూసిఫర్ రీమేక్ లో కీలకమైన సిస్టర్ రోల్ ని సుహాసినితో వేయించే ఆలోచనలో టీం ఉన్నట్టు సమాచారం.

మలయాళం ఒరిజినల్ వెర్షన్ లో దీన్ని మంజు వారియర్ చేశారు. కథలో చాలా కీలకంగా ఉండే ఈ పాత్ర సెకండ్ హాఫ్ లో పలు మలుపులకు కారణం అవుతుంది. మొదట హీరోని ద్వేషించి ఆ తర్వాత అతని సహాయమే కోరే విధంగా దర్శకుడు దాన్ని తీర్చిదిద్దారు. సుహాసిని అయితేనే మంచి ఛాయస్ అవుతుందని యూనిట్ అభిప్రాయమట. ఒకవేళ నిజంగా ఓకే అనుకుంటే చిరంజీవి అడిగితే సుహాసిని కాదనరు. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇది ప్రతిపాదన దశలో ఉన్నట్టుగా తెలిసింది. లూసిఫర్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ చేసే స్టేజి లో ఉందట. చివరి అభిప్రాయం ప్లస్ ఫైనల్ టచ్ అప్ కోసం సుకుమార్ రంగంలోకి దిగినట్టుగా వినికిడి. ఆయన రికమండేషన్ల ప్రకారం చివరి సారి మార్పులు చేసి చిరుకి వినిపించేసి ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది.

ఇక్కడి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు స్టోరీలో చాలా మార్పులు చేశారని టాక్. లూసిఫర్ లో హీరోయిన్ లేకుండానే మూడు గంటలు సాగదీశారు. అందులోనూ హీరో ఇంట్రో అరగంట తర్వాత ఉంటుంది. కేవలం రెండు పాటలు మాత్రమే పెట్టారు. ఇవన్నీ సరిచేసి కొన్ని అదనపు అంశాలు కూడా జోడించినట్టు చెబుతున్నారు. మొత్తానికి లూసిఫర్ ని బాగానే చెక్కుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆచార్య పూర్తయ్యేంత వరకు దీనికి సంబంధించిన ఎలాంటి ప్రకటన ఉండకపోవచ్చు. షూటింగులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో చేతిలో బోలెడు టైం ఉంది. లూసిఫర్ సెకండ్ హాఫ్ లో వచ్చే మరో కీలకమైన యూత్ హీరో పాత్ర ఉంది. దానికి ఎవరిని సెట్ చేస్తారోనని సస్పెన్స్ కొనసాగుతోంది. వీటితో పాటు టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకునే పనులు కూడా మరోవైపు జరుగుతున్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎవరనే దాని మీద అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి