iDreamPost
android-app
ios-app

రూటు మార్చిన టీడీపీ… ఫలితం ఉంటుందా..?

రూటు మార్చిన టీడీపీ… ఫలితం ఉంటుందా..?

మూడు రాజధానుల ఏర్పాటు విషయం ఆంధ్రప్రదేశ్‌లో 44 రోజులుగా రగులుతూనే ఉంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అధికార వైఎస్సార్‌సీపీ, ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని టీడీపీ.. పట్టుదలతో ఉన్నాయి. మూడు రాజధానుల్లో ముఖ్యంగా విశాఖపైనే ఇరు పార్టీలు దృష్టి సారించాయి. న్యాయ రాజధాని అయిన రాయలసీమలోని కర్నూలు.. వార్తల్లో పెద్దగా నిలవడంలేదు. అక్కడ కేవలం హైకోర్టు, న్యాయశాఖకు చెందిన కార్యకలాపాలు మాత్రమే ఏర్పాటు చేయనుండడం ప్రధాన కారణం. సచివాలయం, సీఎంవో, శాఖాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేసే కార్యానిర్వాహఖ రాజధాని అయిన విశాఖ కేంద్రంగానే ప్రస్తుతం రాజధాని రాజకీయం నడుస్తోంది.

నిన్నటి వరకు అమరావతికి ఉన్న అనుకూలతలను వివరిస్తూ ఉద్యమాలు, తమ వాదనలు వినిపించిన టీడీపీ.. ఇప్పుడు తన రూట్‌ను మార్చింది. విశాఖను టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేస్తోంది. కార్యనిర్వాహఖ రాజధానిగా విశాఖ శ్రేయష్కరం కాదని వాదిస్తోంది. భద్రత, పర్యావరణ ముప్పు అనే రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తుఫాన్లు వస్తాయని చెబుతోంది. జీఎన్‌ రావు కమిటీ కూడా ఇదే విషయం చెప్పిందంటూ నిన్నటి నుంచి టీడీపీ అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేసింది.

మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు మీడియా ముందుకు వస్తున్నారు. విశాఖకు వ్యతిరేకంగా జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చినా అధికార పార్టీ నేతలు అక్కడే కార్యనిర్వాహఖ రాజధాని ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. శాసన మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు జీఎన్‌ రావు కమిటీ నివేదిక, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ మీడియాకు లేఖలు విడుదల చేశారు.

తాను ఇచ్చిన నివేదికను చూపిస్తూ విశాఖకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని జీఎన్‌రావు ఖండించాల్సిన స్థాయిలో టీడీపీ, అనుకూల మీడియా ప్రచారం చేయడం గమనార్హం. విశాఖను వద్దని తాను ఇచ్చిన నివేదికలో లేదని జీఎన్‌రావు స్పష్టం చేశారు. విశాఖ మెట్రో రీజియన్‌లో నగరానికి 40 –50 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భవనాలు నిర్మించుకోవాలని సూచించానని పేర్కొన్నారు. సముద్ర తీరం ఉన్న అన్ని నగరాలకు ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు విశాఖకు కూడా ఉంటాయని జీఎన్‌ రావు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

విశాఖకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ధీటుగా తిప్పికొడుతోంది. నిన్న చెత్త అన్న జీఎన్‌ రావు కమిటీ నివేదక ఈ రోజు భగవద్గీత అయిందా..? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నలు సంధిస్తున్నారు. తుఫాన్లు వస్తే సముద్రతీర ప్రాంతంలోనే దాని ప్రభావం ఉంటుందని, ఇతర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. అదే వరద వస్తే అమరావతి మొత్తం మునకలో ఉంటుందంటూ టీడీపీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తున్నారు.

ప్రపంచంలో ఎవరు అడ్డుకున్నా.. విశాఖ కార్యనిర్వాహఖ రాజధానిగా ఏర్పాటు చేస్తామని ఇటీవల వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేస్తూ మూడు రాజధానులపై తమ వైఖరిని కుండ బద్దలు కొట్టారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే శాసన సభలో మూడు రాజధానులపై తీర్మానం కూడా చేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విశాఖకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న ప్రచారం వల్ల ఆ పార్టీకి ఆశించిన ఫలితం ఉంటుందా..? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. మరి టీడీపీ లక్ష్యం నెరవేరుతుందా..? వేచి చూడాలి.