iDreamPost
android-app
ios-app

సంక్రాంతి 2021 – ఒక పెద్ద పజిల్

  • Published May 03, 2020 | 6:10 AM Updated Updated May 03, 2020 | 6:10 AM
సంక్రాంతి 2021 – ఒక పెద్ద పజిల్

టాలీవుడ్ కు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ ఒక బంగారు బాతు లాంటిది. స్టార్లు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు రెండు మూడైనా ఈజీగా వర్కౌట్ చేసుకుని వందల కోట్ల వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ ఒక్క ఈ సీజన్ కే ఉంటుంది. అందుకే ఆరేడు నెలల ముందే తమ ప్రాజెక్ట్స్ ఆ తేదీకి వచ్చేలా పెద్ద హీరోల నిర్మాతలు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. మరీ గొప్పగా లేని కంటెంట్ తో వచ్చిన భోగి మూవీస్ ఈ ఏడాది ఎంత బ్రహ్మాండంగా కలెక్షన్ల వర్షం కురిపించాయో ప్రత్యక్షంగా చూశాం. అందుకే 2021కి రాజమౌళి గురి చూసి మరీ ఆర్ఆర్ఆర్ కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. తీరా చూస్తే కరోనా రూపంలో ఇప్పుడు అందరి ప్లానింగ్ కకావికలం అయ్యింది.

ఎక్కడిక్కడక షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని సెన్సార్ కు వెళ్లాల్సిన సినిమాలూ క్యూలో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అసలేం జరగబోతోందో అర్థం కానీ గందరగోళం నెలకొన్న మాట వాస్తవం. ఆర్ఆర్ఆర్ వాయిదా తప్పదనే మాట ఫిలిం నగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే చిరంజీవి ఆచార్య రేస్ లోకి వస్తుంది. కానీ అది కూడా ఆగస్ట్ లోనే షూటింగ్ మొదలుపెట్టుకుని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం రామ్ చరణ్ డేట్స్ ని పక్కాగా లాక్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకవేళ ఇంకా లేట్ అయితే మాత్రం ఆచార్య రావడం కూడా జరగని పనే. ప్రభాస్ 20 కూడా ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది. వందల కోట్ల ప్రాజెక్ట్ కావడంతో చుట్టేయడానికి లేదు.

మహేష్ బాబు అసలు సినిమానే మొదలుపెట్టలేదు కాబట్టి ఇంత షార్ట్ టైంలో సంక్రాంతికి రావడం అసాధ్యం. పెద్ద హీరోలందరూ ఇలా చిక్కుల్లో పడిపోయారు. ఏదైనా పక్కాగా ఛాన్స్ ఉంది అంటే అది వెంకటేష్ నారప్పకే. ఇంకా 25 శాతం మాత్రమే బాలన్స్ ఉంది కాబట్టి అందులోనూ గ్రామీణ నేపధ్యం కాబట్టి రాష్ట్రం దాటాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఫైటర్, నితిన్ రంగ్ దే, కీర్తి సురేష్ మిస్ ఇండియా, నాని టక్ జగదీశ్ తదితర సినిమాలు శరవేగంగా డిసెంబర్ కంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునే పరిస్థితిలో లేవు. ఏ కోణంలో చూసినా సంక్రాంతి 2021 పెద్ద పజిల్ గా మారబోతోంది. దీన్ని పరిష్కరించడం అంత ఈజీ కాదు కానీ ప్రభుత్వాలు షూటింగులకు ఎప్పుడు అనుమతులు ఇస్తాయనే దాని మీదే ఇదంతా ఆధారపడి ఉంది.