పవన్‌ కళ్యాణ్‌కు మూడు రాజధానుల సెగ..

మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌కు రాయలసీమ సెగ తగిలింది. ఈ రోజు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌ను రాయలసీమ విద్యార్థి జేఏసీ అడ్డుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ విద్యార్థులు మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. పవన్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి తరలించారు.

కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో 2017లో హత్యాచారం, హత్యకు గురైన పదో తరగతి విద్యార్థి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేలా దోషులను శిక్షించాలనే డిమాండ్‌తో జస్టిస్‌ ఫర్‌ సుగాలి ప్రీతి అనే పేరుతో పవన్‌ కళ్యాణ్‌ ర్యాలీ తలపెట్టారు. కర్నూలు లోని రాజ్‌ విహార్‌ సెంటర్‌ నుంచి కోట్ల సెంటర్‌ వరకు జరిగే ర్యాలి ప్రారంమైంది. ఆ సమయంలోనే రాయలసీమ విద్యార్థి జేఏసీ పవన్‌ కాన్వాయ్‌ను అడ్డుకుంది.

మొన్నటి వరకు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌.. రెండు రోజుల క్రితం కర్నూలుజిల్లా కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. ఈ పర్యటన ఉన్న నేపథ్యంలోనే పవన్‌ కళ్యాణ్‌ అలా మాట్లాడారు గానీ అదే మాటపై పవన్‌ ఉంటారన్న నమ్మకం లేదని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అంతకుముందు న్యాయ రాజధాని వస్తే అభివృద్ధి జరుగుతుందా..? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండాలని బహిరంగ సభలో చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఆ తర్వాత మాట ఎలా మార్చింది వారు గుర్తు చేస్తున్నారు.

Show comments