iDreamPost
android-app
ios-app

మొదటి రోజు లాక్ డౌన్.. ప్రజలు బయటకెందుకు వచ్చారు..?

మొదటి రోజు లాక్ డౌన్.. ప్రజలు బయటకెందుకు వచ్చారు..?

మానవాళి మనుగడ కోసం ప్రపంచమంతా లాక్‌డౌన్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీన్ని సరిగా పాటించకపోతే సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. అయినా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ప్రజలు చాలా ప్రాంతాల్లో బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తించారంటూ పలు మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి. పెట్రోలు బంకులు, కూరగాయల షాపులు కూడా రాత్రి ఏడు గంటలకే మూసేస్తామని ప్రకటిస్తున్న నేపధ్యంలో అత్యవసరాల కోసమే బయటకు వెళ్లాలని, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు అందాయి.

ఈ మేరకు వారు పనిచేస్తున్నా హైదరాబాద్ లో భారీఎత్తున ప్రజలు సోమవారం ఉదయం రోడ్లపైకి వచ్చేసాయి. మోటారు వాహనాలు, ప్రైవేట్ వెహికల్స్ లో చాలామంది బయట సంచారం మొదలు పెట్టేసారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో చాలాచోట్ల జనజీవనం బయట కనిపించేసరికి పోలీసు, వైద్యశాఖల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ఇటలీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోందని చెప్తున్నారు.

అయితే దీనికి ప్రజలనుండి వచ్చే సమాధానం మరోలా ఉంది. వాస్తవానికి గత యేడాది డిశంబర్ లోనే కరోనా వైరస్ పుట్టినా రెండు నెలలకు అంటే గత ఫిబ్రవరి నెలకు మిగతా దేశాలపై ప్రభావం చూపించింది. మనదేశంలో కరోనా ప్రభావం చూపి ఇంకా నెలరోజులు కూడా కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం గత పదిరోజుల నుండే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఇద్దరు ముఖ్యమంత్రులు మన రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ లేదని ఎటువంటి భయం పెట్టుకోవద్దని సూచించారు.

కట్ చేస్తే ప్రధాని మోడి జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. దేశం మొత్తం మాదిరిగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా జనతా కర్ఫ్యూలో పాల్గొని కరతాళ ధ్వనులు చేసారు. ఇలా చేసిన కొద్ది సేపటికే తెలుగురాష్ట్రాల మఖ్యమంత్రులిద్దరూ మార్చి 31 వరకూ.. అంటే దాదాపుగా 13 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు. రేషన్ తో పాటు ఆర్ధికసాయం ప్రకటించారు.. అయితే అది వేరే విషయం. అంటే సామాన్యులకు కనీసం 24గంటల సమయం కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. నెల సరుకులు, పాలు, పెరుగు, పిల్లలకు ఆహారం, మందులు వంటివి తెచ్చుకోవడానికి సరైన సమయం ఇవ్వలేకపోయారు.

ఏదేమైనా ఇలాంటి భయంకరమైన వైరస్ ఏదేశంలో పుట్టినా ప్రస్తుతం ఉన్న రవాణా సౌకర్యాల దృష్ట్యా కచ్చితంగా భూమిపై ఉన్న అన్ని దేశాలకు వ్యాపించడం సంభవమే.. అయినా చాలా ఆలస్యంగా మనదేశానికి కరోనా రావడంతో భారతీయులంతా అప్రమత్తమయ్యే ఆస్కారం దక్కింది. మనకంటే ముందు ఈ వైరస్ బారినపడిన దేశాలనుండి పాఠాలు నేర్చుకోవడానికి సమయం దక్కింది. వారు ఎలా వైరస్ ను జయించారో తెలుసుకుని ఆయా పద్ధతులు పాఠించడానికి అవకాశం దొరికిందనే భావించాలి. ప్రభుత్వానికి సహకరిస్తూ స్వీయ నియంత్రణ ద్వారా కరోనా మహమ్మారిని జయిద్దాం. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుద్దాం.