iDreamPost
iDreamPost
సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ రన్ రాలేని పరిస్థితుల్లో థియేటర్ కు వెళ్లలేని ఆడియన్స్ ఓటిటి కోసం ఎదురు చూడటం సహజం. అందులోనూ ఇటీవలే టాలీవుడ్ సక్సెస్ రేట్ విపరీతంగా పెరగడంతో వాటిని ఎప్పుడెప్పుడు స్మార్ట్ స్క్రీన్ మీద చూద్దామాని ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది. ఓసారి ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం.దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించిన అందమైన దృశ్య కావ్యం ”సీతారామం’ హక్కులు అమెజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సెప్టెంబర్ 9న పే పర్ వ్యూ మోడల్ లేదా ఓపెన్ స్ట్రీమింగ్ ద్వారా అందుబాటులోకి రావొచ్చు. అధికారిక ప్రకటన రాలేదు
‘కార్తికేయ 2’ జీ ఫైవ్ సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాభై రోజుల తర్వాత తమ సినిమా ఓటిటిలో వస్తుందని హీరో నిఖిల్ చెప్పాడు కాబట్టి అక్టోబర్ మొదటివారం కంటే ముందు రాకపోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్పు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘బింబిసార’ సైతం ఇదే ఓటిటి వద్ద ఉంది. ఈ ప్లాట్ ఫార్మ్ మరీ తొందరగా ప్రీమియర్లు ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి కొంత వెయిట్ చేయాల్సి రావొచ్చు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ డిజాస్టర్ అయినప్పటికీ డిజిటల్ కోసం పెద్ద వెయిటింగ్ ఉంది. వచ్చే వారం సోనీ లివ్ లో రిలీజయ్యే వార్తను కొట్టి పారేయలేం. నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ని పోగొట్టుకున్న ‘లాల్ సింగ్ చడ్డా’ ఆరు నెలల దాకా వేచి చూసే సీన్ ఉండకపోవచ్చు
ఇక బాలీవుడ్ వైపు లుక్ వేస్తే అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ జీ5 వద్ద ఉంది. డిజాస్టర్ అయిన నేపథ్యంలో నెల రోజుల లోపే అందుబాటులోకి రావొచ్చు. ఘోరంగా ఫెయిలైన తాప్సీ ‘దొబారా’ను త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో చూసుకోవచ్చు. కార్తీ ‘విరుమన్’ తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానప్పటికీ ఒరిజినల్ తమిళ వెర్షన్ ని ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ లో వదిలేస్తారు. కన్నడలో ఆల్రెడీ వచ్చిన ‘777 ఛార్లీ’ ఇంకా తెలుగులో రానేలేదు. పృథ్విరాజ్ సుకుమారన్ ‘కడువా’ మలయాళంలో మాత్రమే వచ్చింది. రాబోయే రోజుల్లో వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరగానే వస్తాయి. మొత్తానికి ఓటిటి ఫ్యాన్స్ కోసం థియేటర్ మూవీస్ అన్నీ త్వరలోనే రాబోతున్నాయి