జేడీ పయనమెటు..?

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) వి.వి. లక్ష్మీ నారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో ఊపందుకుంది. జేడీ తదుపరి రాజకీయ ఇన్నింగ్స్‌ ఏ పార్టీ నుంచి సాగుతుందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. లక్ష్మీ నారాయణ ముందు పలుదారులు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఆప్షన్‌ –1 : ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల సమరం సాగుతోంది. ఫిబవ్రరి 8వ తేదీన పోలింగ్‌ జరగబోతోంది. ఆప్‌కి మద్దతుగా జేడీ లక్ష్మీ నారాయణ ఢిల్లీలో ప్రచారం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలో ఆప్‌ను జేడీ లక్ష్మీ నారాయణ ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తారన్న ప్రచారం జరిగింది. ఆప్‌ ఏపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని వార్తలొచ్చాయి. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం జేడీకి ఆప్‌ తలుపులు తెరిచి ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత తిరిగి ఆప్‌ను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించేందుకు ప్రణాళికలు రచించొచ్చని అంచనా వేస్తున్నారు. పార్టీ నడపడంలో అనేక సాధక బాధకాలు ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి జేడీ చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు.

Read Also: పవన్ కళ్యాణ్ కి మరో షాక్ – జేడీ రాజీనామా

ఆప్సన్‌ –2 : కేంద్ర సర్వీస్‌లో పని చేసిన జేడీ ముందున్న మరోదారి బీజేపీ. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడం వల్ల రాజకీయంగా అనేక అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో అధికారంలో ఉంది. మరో నాలుగున్నరేళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. బీజేపీ తరఫున ఏపీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఇటీవల జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జనసేనకు రాజీనామా చేసిన జేడీని వెంటనే బీజేపీ చేర్చుకుంటే ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అవకాశానికి కూడా తక్కువ ప్రాధాన్యత ఉందని పేర్కొంటున్నారు.

ఆప్షన్‌ – 3 : ఏపీ రాజకీయాల్లోనే కొనసాగాలనుకుంటే జేడీ ముందున్న మరో మార్గం స్థానిక ప్రాంతీయ పార్టీల్లో చేరడం. అధికార వైఎస్సార్‌సీపీ జేడీకి అవకాశం ఇవ్వదు. ఇక మిగిలింది టీడీపీ. ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలోనే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున జేడీ పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగా సాగింది. అయితే ఆయన జనసేనలో చేశారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న టీడీపీలో జేడీ చేరే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. పైగా ఒక ప్రాంతీయ పార్టీలో విఫలమైన నేపథ్యంలో మరో ప్రాంతీయ పార్టీకి వెళ్లబోరని పేర్కొంటున్నారు.

Read Also: ఎక్కే గడప దిగే గడప , తర్వాత ఎవరో …

ఆప్షన్‌ – 4: జేడీ ముందున్న నాలుగో ఆప్షన్‌.. వేచి చూడడం. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉండడం. గతంలోలాగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, అవి ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా మీడియా సమావేశాలు, చర్చలు పెట్టి కొంత కాలం గడపడం. ఈలోపు బీజేపీ – జనసేన ల మధ్య పొత్తు కొనసాగడమా..? లేదా జనసేన బీజేపీలో విలీనం కావడమా..? అనేది తేలుతుంది. అప్పుడు బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ చురుకుగా ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు ఏపీ బీజేపీలో ముఖ్య పాత్ర పోషించే ఈ ఆప్షన్‌కే జేడీ మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Show comments