iDreamPost
android-app
ios-app

మద్య నిషేధం మీద మీరు కూడా మాట్లాడితే ఎలా బాబు ?

మద్య నిషేధం మీద మీరు కూడా మాట్లాడితే ఎలా బాబు ?

మే 4 నుంచి కరోనా ప్రభావం తక్కువగా/అసలు లేని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభించే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. దేశంలో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పక్క రాష్ట్రంలో కూర్చుని ఉన్నప్పటికీ … ఆయన, ఆయన పార్టీ నాయకులు, వారి కన్నా ప్రమాదకరమైన వారి అనుకూల మీడియా సహాయంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. ఇదే అదనుగా వైఎస్ జగన్ ఎన్నికలప్పుడు ఇచ్చిన మధ్యనిషేధం హామీని అమలు చేసేయచ్చుగా అంటూ కొత్త వాదనను తెర మీదకు తెచ్చారు. వారికి తెలియనిది, జనానికి కనిపిస్తున్నది ఏంటంటే – ‘దశల వారీగా మధ్యం అమ్మకాలు తగ్గించి వచ్చే ఎన్నికల సమయానికి సంపూర్ణ మధ్యనిషేధం తీసుకొస్తామ’ని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటకే కట్టుబడి ఉన్నాడని.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే నవంబర్ 2019 నాటికే ‘ఈనాడు’లో వచ్చిన వార్తే అందుకు సాక్ష్యం – ఆరు నెలలు కూడా పూర్తి కాక ముందే మద్యం అమ్మకాల మీద, బెల్టు షాపుల పైన ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుందో; చంద్రబాబు స్థాయి మరిచి, దిగజారి తూలనాడిన ‘గ్రామ వాలంటీర్’ వ్యవస్థ క్షేత్రస్థాయిలో ఎలా పని చేస్తోందో చెప్పారు.

* మద్యం అమ్మకాల సమయాన్ని కుదించారు. పల్లెల్లో దుకాణాల సంఖ్య బాగా తగ్గింది.
* కొత్త ఎక్సైజ్ సంవత్సరం ప్రారంభమైంది, ఈ ఏడాది దుకాణాల సంఖ్య 273 కు తగ్గింది.
* అక్రమంగా నిల్వ చేసిన మద్యం పైన దాడులు జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
* బెల్టుషాపులు ఉన్నట్టు ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే తొలగించేందుకు జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.
* క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటిస్తూన్న గ్రామ వాలంటీర్ల నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తనిఖీలు చేస్తున్నారు.

పాతిక సీట్లు గెలవకపోయినా కూడా ప్రతిపక్షం కనుక, ప్రతీది రాజకీయం చేయడమే అనుభవం కనుక ప్రస్తుతం వైన్ షాపులు తెరవడాన్ని పార్టీ ఉనికి కోసం తప్పుపట్టచ్చు. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల పట్ల జగన్ చిత్తశుద్ధిని విమర్శించేందుకు తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే 2014 లో ప్రమాణస్వీకారం రోజున చంద్రబాబు ‘బెల్టు షాపులు రద్దు’ అంటూ ఫైల్ మీద సంతకం చేశారు. అదే సంవత్సరం నవంబర్ 10 న ‘ఒక మద్య దుకాణం లైసెన్స్ మీద పల్లెల్లో ‘అనుబంధ దుకాణాలు’ పెట్టుకోవచ్చు’ అంటూ బెల్టుషాపులకే తెలుగు నామధేయాన్ని కూడా తీసుకొచ్చారు. మూడేళ్ళ తర్వాత 2017లో ‘బెల్టుషాపులు రద్దు చేస్తున్నామని క్యాబినెట్లో మళ్ళీ తీర్మానం చేశారు. 2017 జులై 19 న ‘రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులు మూసేయాల్సిందే’ అని అప్పటి ముఖ్యమంత్రి మరోసారి ఆదేశించారు.

కానీ 2018 ఫిబ్రవరి నెలలో కూడా ఎక్సైజ్ శాఖ వారు దాడులు చేసి ఎన్నో బెల్టు షాపుల మీద కేసులు వేసి, అరెస్టులు కూడా చేశారు. ఆ తర్వాత 2019 లో ఎన్నికల ప్రచార సభల్లో ఒక్క చోట కూడా “బెల్టు షాపులు లేని ఊళ్ళలో మాత్రమే మా పార్టీ అభ్యర్ధులకు ఓటేయండి” అని తెలుగుదేశం వారు ధైర్యంగా చెప్పలేకపోయారు. అంటే అంత అనుభవజ్ఞుడు అధికారంలోకి వచ్చిన రోజు ప్రకటించిన ‘బెల్టు షాపుల రద్దు’ అయిదేళ్లయినా పూర్తిగా అమలులోకి రాలేదు. అలాగే మద్యాన్ని టెట్రా ప్యాకెట్లలో లభ్యమయ్యేలా చేయబోతున్నారనే వార్త ఒకటి ఆ మధ్య చక్కర్లు కొట్టింది కూడా. తెదేపా ప్రభుత్వం బెల్టు షాపుల రద్దుతో పాటు ‘డీ అడిక్షన్ సెంటర్స్’ కూడా పెడతామని ఇచ్చిన హామీ సంగతి సరే సరి. ప్రజలు ‘వారుణి వాహిని’ పథకాన్ని, పోలీస్ స్టేషన్ల ద్వారా మద్యం అమ్మించిన గతాన్ని, మద్యం మీద వచ్చే ఆదాయంతో సంక్షేమపథకాలు నడుపుతామన్న మాటల్ని ప్రజలు మరిచిపోయారనుకుంటున్నారా ?అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైసీపీ హామీల అమలు తీరును తప్పు పడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.