Idream media
Idream media
కరోనా ముగిసి, ప్రపంచమంతా కోలుకుంటే కొంత కాలం పాటు కరోనా లాక్‌డాన్ కథాంశంతోనే సినిమాలు వస్తాయి. ప్రపంచాన్ని కబళించడానికి కరోనాని వదిలిన విలన్, రక్షించడానికి వచ్చే హీరో కథ. లేదంటే కరోనా తెచ్చిన ఎమోషన్స్, కామెడీ, హారర్, వందజానర్లలో కథలొస్తాయి.
1.విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు, కరోనాతో నెలరోజులకు పైగా ప్రతి క్షణం కలిసి ఉంటారు. ఆ తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ ఎమోషన్.
2.ఒక తీవ్రవాది జైలు నుంచి తప్పించుకుంటాడు. ఒక కాలనీలో దాక్కున్నాడని తెలుస్తుంది. మహేశ్‌బాబు రంగంలోకి దిగుతాడు. మూతికి మాస్క్ కట్టుకుంటే మహేశ్ హీరోయిజం దెబ్బ తింటుంది. కాబట్టి , మాస్క్ లేకుండానే కాలనీలోకి వెళుతాడు. అక్కడ హీరోయిన్‌తో లవ్. మధ్యలో చేతులు కడుక్కుంటూ, హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుతాడు. చివరికి తీవ్ర వాదిని ఎలా పట్టుకుంటాడు ఇది యాక్షన్.
3. అంతరిక్షం నుంచి వచ్చిన ఒక దుష్టశక్తి , ప్రపంచ నాశనానికి వైరస్‌ని వదులుతుంది. డ్రెస్ డిజైనర్‌గా ఉన్న అల్లు అర్జున్ యాంటీ వైరస్ సూట్ తయారు చేసి ఆ శక్తిని ఎదుర్కొంటాడు. మధ్యలో మంత్రశక్తులు కలిగిన మంచి మాంత్రికుడు ప్రకాశ్‌రాజ్ హీరోకి హెల్ప్ చేస్తాడు. ఇది ఫాంటసీ.
4.హీరోయిన్ ఒక విల్లాలో ఒంటరిగా ఉంటుంది. సైకో కిల్లర్ ఎంటర్ అవుతాడు. హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి ఫోన్ చేస్తుంది. అతను వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. పోలీసుల Help Line నెంబర్లు పనిచేయవు. బయట లాక్‌డౌన్. అతను బైక్ మీద వచ్చి హీరోయిన్‌ని ఎలా కాపాడాడు? ఇది థ్రిల్లర్.
5.దొంగతనాలు చేయకపోతే నానికి నిద్ర పట్టదు. లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లు వదిలి రావడం లేదు. ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి బీరువాలోని డబ్బుని దోచేశాడు. దీన్ని SI రావు రమేష్ సీరియస్‌గా తీసుకున్నాడు. 24 గంటల్లో వాన్ని పట్టుకోకపోతే Self Isolation తీసుకుంటానని ఛాలెంజ్ చేశాడు. ఇది కామెడీ.
6.శర్వానంద్ ఒక ఫ్యాక్షనిస్ట్ కూతురితో లేచిపోయాడు. సడెన్‌గా లాక్‌డౌన్. ఒక లారీ ఎక్కారు. అది సరాసరి ఫ్యాక్షనిస్ట్ ఊళ్లో ఆగిపోయింది. కదలదు. ఏం చేయాలి? రొమాంటిక్ థ్రిల్లర్.
7.కొత్తగా చేరిన ఇంట్లో దెయ్యం ఉందని అనుష్కకి తెలుస్తుంది. బయట కర్ఫ్యూ, ఇంట్లో దెయ్యం. హారర్ కామెడీ.
8.ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్. సర్జికల్ స్ట్రైక్‌కి Loc దాటి పాకిస్తాన్ వెళ్తాడు. కంట్రీ లాక్‌డౌన్ అవుతుంది. పాకిస్తాన్‌లో నెలరోజులుండాలి.—యాక్షన్ విత్ దేశభక్తి.
9.వరుణ్‌తేజ్ ఇంట్లో మర్డర్ జరిగింది. శవాన్ని మాయం చేయాలి. బయట పోలీసులు మర్డర్ మిస్టరీ కథ.
10.లారీ డ్రైవర్‌గా బీహార్ వెళ్లిన రాంచరణ్ లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోతాడు. అక్కడ ఒక గ్రామాన్ని విలన్ల నుంచి కాపాడుతాడు.
ఇలా చెబుతూ వెళితే వంద కథలొస్తాయి. కరోనా తగ్గి, మళ్లీ ప్రేక్షకులు థియేటర్‌కి రావాలే కానీ, కథలకేం కొదువా?