iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ కి మ‌ళ్లీ రాజ్య‌స‌భ ఆశ‌లున్నాయా?

  • Published Feb 25, 2020 | 5:12 PM Updated Updated Feb 25, 2020 | 5:12 PM
మెగాస్టార్ కి మ‌ళ్లీ రాజ్య‌స‌భ ఆశ‌లున్నాయా?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన స్థానం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాజ‌కీయాల్లో అదే రీతిలో శాసించాల‌ని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. చివ‌ర‌కు ఆయ‌న సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్ర మంత్రివ‌ర్గంలో చేరినా ఎక్కువ కాలం కొన‌సాగ‌డానికి ఛాన్స్ ద‌క్క‌లేదు. దాంతో మ‌ళ్లీ సినిమాల‌తో ఆయ‌న బిజీ అయిపోయారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటూనే సినీరంగానికి సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన చిరంజీవి ఇటీవ‌ల క్రియాశీల‌కంగా మారుతుండ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

అదే స‌మ‌యంలో చిరంజీవి మ‌ళ్లీ సినిమాల త‌ర‌హాలో రాజ‌కీయాల్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలున్నాయ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటి చుట్టూ ప‌లు క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. కానీ చిరంజీవికి అలాంటి ఆశ‌లు ఉన్నాయా అంటే అవున‌ని, కాద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి చిరంజీవి త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని బీజేపీ బలంగా ఆశించింది. ఆపార్టీ నేత‌లు ప‌లుమార్లు చిరంజీవి తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరి కాకుండా హూందాగా రాజ‌కీయాలు న‌డ‌ప‌డం, త‌న వ‌ల్ల కాద‌ని తెలిసిన త‌ర్వాత నేరుగా సినిమాల‌కే ప‌రిమితం కావ‌డం త‌ద్వారా సొంత వ‌ర్గంలోనూ, ఇత‌ర సామాన్యుల్లోనూ చిరంజీవికి కొంత సానుకూలత ఉంది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో కేవ‌లం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని త‌ప్ప ఇత‌రుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి సార‌ధ్యం వ‌హిస్తే మ‌రోసారి ఏపీలో సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో కాస్త వ్య‌వ‌హారం చ‌క్క‌బెట్ట‌వ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌లు ఆశించారు. కానీ చిరంజీవి నుంచి అనుకూల‌త రాక‌పోవ‌డంతో ఆఖ‌రికి అన్న‌య్య‌ను వ‌దిలి త‌మ్ముడితో చేతులు క‌లిపిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చిరంజీవి ఇటీవ‌ల జ‌గ‌న్ తో కొంత సానుకూలంగా ఉంటున్నారు. సైరా సినిమా విడుద‌ల సంద‌ర్భంగా కుటుంబ స‌మేతంగా అమ‌రావ‌తి సీఎం క్యాంప్ ఆఫీసులో క‌లిసి విందు ఆర‌గించ‌డంతో స‌రిపెట్ట‌కుండా ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప్ర‌క‌ట‌నలు విడుద‌ల చేశారు. మూడు రాజ‌ధానుల వంటి కీల‌క అంశాల‌లో మ‌ద్ధ‌తు ప‌లికారు. దాంతో ఇక చిరంజీవి, జ‌గ‌న్ రాజ‌కీయంగా ఒక్క‌ట‌య్యార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. దానికి తోడుగా నందీ అవార్డుల విష‌యంలోనూ, విశాఖ‌లో సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి వ్య‌వ‌హారంలోనూ చిరు చొర‌వ చూపుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో చిరంజీవి మ‌ళ్లీ పెద్ద‌ల స‌భ వైపు క‌న్నేశార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. జ‌గ‌న్ కూడా అందుకు సానుకూలత వ్య‌క్తం చేస్తార‌నే అంచ‌నాలు వినిపించాయి.

కానీ చిరంజీవి స‌న్నిహితులు మాత్రం వాటిని తోసిపుచ్చుతున్నారు. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో చిరంజీవి వేలుపెట్టే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. కుటంబ స‌భ్యులు దానికి స‌సేమీరా అంటున్నార‌ని స‌మాచారం. సినిమాలు చేసుకుంటూ, సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద త‌ర‌హాలో ముఖ్య భూమిక పోషించ‌డానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న్ని స‌న్న‌ద్ధం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఈసారి రాజ్య‌స‌భ సీట్ల‌లో వైఎస్సార్సీపీకి ద‌క్కే నాలుగు స్థానాల్లో ఒక‌టి ఆయ‌న‌కు కేటాయించే అవ‌కాశం చాలా స్వ‌ల్ప‌మేన‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ, జ‌గ‌న్ బంధం నేప‌థ్యంలో ఒక స్థానం బీజేపీకి ఇచ్చే అవ‌కాశాలున్న త‌రుణంలో మ‌రో సీటు చిరంజీవికి క‌ట్ట‌బెడ‌తార‌నే అంచ‌నాలు వాస్త‌వ రూపం దాల్చ‌డం క‌ష్ట‌మేన‌ని కూడా కొంద‌రు చెబుతున్నారు. దాంతో ప్ర‌స్తుతానికి చిరంజీవి నిజంగా ప్ర‌య‌త్నిస్తారా..జ‌గ‌న్ ఆయ‌న్ని క‌నిక‌రిస్తారా అన్న‌దానికి కాలమే స‌మాధానం చెప్పాలి. 2012 నుంచి 2018 వ‌ర‌కూ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఉన్న స‌మ‌యంలో కూడా స‌భ‌కు హాజ‌రుకావ‌డానికి, ఇత‌ర వ్య‌వ‌హారాల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త‌నివ్వ‌లేద‌నే అభిప్రాయం చిరంజీవి మీద ఉంది. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల మీద శ్ర‌ద్ధ పెట్టిన స‌మ‌యంలో అలాంటి స‌మ‌స్య‌లు పున‌రావృతం చేస్తారా అన్న‌ది సందేహంగానే భావించాల్సి ఉంటుంది.