Akhanda Review : అఖండ రివ్యూ

గత కొనేళ్లుగా సక్సెస్ లేక బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అఖండ ఇవాళ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలయ్యింది. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక స్టార్ హీరో నటించిన మాస్ బొమ్మ ఏదీ రిలీజ్ కాకపోవడంతో బయ్యర్లు కూడా దీని మీద విపరీతమైన అంచనాలు పెట్టేసుకున్నారు. అందులోనూ బాలయ్య బోయపాటి శీను కాంబినేషన్ హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకం అభిమానుల్లో విపరీతంగా ఉంది. హీరో డ్యూయల్ రోల్, తమన్ మ్యూజిక్ గురించి ఇప్పటికే ఓ రేంజ్ లో టాక్ నడుస్తుండటం లాంటివి ప్లస్ అయ్యాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం

కథ

అనంతపురంకు చెందిన రైతు మురళీకృష్ణ(బాలకృష్ణ)నలుగురికి మంచి చేస్తూ ఫ్యాక్షన్ గొడవలు లేకుండా సీమను ప్రశాంతంగా ఉంచుతూ కాలేజీలు వగైరా నడుపుతుంటాడు. ఆ జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన శరణ్య(ప్రగ్య జైస్వాల్)ఇతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమించేసి పెళ్లి చేసుకుంటుంది. అక్కడ మైనింగ్ గనులు నడుపుతున్న వరదరాజులు(శ్రీకాంత్)వల్ల మురళీకృష్ణ అరెస్ట్ అవుతాడు. ఎక్కడో ఉండే గజేంద్ర బాబా(నితిన్ మెహతా) వల్ల కుటుంబానికి పెద్ద ప్రమాదం ముంచుకురావడంతో అఖండ(బాలకృష్ణ)ఎంట్రీ ఇస్తాడు. అసలు ఈ కవలల వెనుక గుట్టు ఏంటి, అఖండ అఘోరా ఎందుకయ్యాడు ఇవన్నీ తెరమీద చూడాల్సిందే

నటీనటులు

బాలకృష్ణ ఒక పవర్ హౌస్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దాన్ని సంపూర్ణంగా ఎలా వాడుకోవాలో బోయపాటికి తెలిసినట్టుగా ఇంకెవరికి రాదనేది వాస్తవం. మురళీకృష్ణ పాత్ర కేవలం లుక్స్ బాగుండటానికి పరిమితమైనప్పటికీ అసలైన విశ్వరూపం అఖండ క్యారెక్టర్ లో కనిపించింది. ఈ రూపంలో కనిపించే ప్రతి ఫ్రేమ్ అభిమానులకు విందు భోజనమే. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో, విలన్స్ తో ఛాలెంజ్ చేసే సన్నివేశాల్లో మరోసారి తనదైన టైమింగ్ తో చెలరేగిపోయారు. ఇంతవయసులోనూ డాన్స్ కోసం కష్టపడుతున్న తీరు చూస్తే ముచ్చటేస్తోంది. అఖండ మొత్తాన్ని తన భుజాల మీదే మోశారు.

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ చెప్పుకోవడానికి కలెక్టర్ అని ఇచ్చారు కానీ తనకు మాత్రం పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆకర్షణ పరంగా ఓకే కానీ దీని వల్ల ఉపయోగం ఏముంటుందో వేచి చూడాలి. శ్రీకాంత్ పాత్రని లెజెండ్ రేంజ్ లో డిజైన్ చేసిన ప్రయత్నం చివరికి రొటీన్ గానే అనిపిస్తుంది, జగపతిబాబుకు మీసాలు గడ్డాలు సరిగా అతకక యాక్టింగ్ కూడా అందులోనే కలిసిపోయింది. పూర్ణ ఎప్పుడో సపోర్టింగ్ రోల్స్ కి వచ్చేసింది కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి లేదు. నాగ మహేష్ ఫస్ట్ హాఫ్ వరకే పరిమితమైనా గుర్తుండిపోతాడు. మెయిన్ విలన్ నితిన్ మెహతా మేకప్, డబ్బింగ్ తో భయపెట్టేలా చూపించారు. ఇంకా ఆర్టిస్టులు చాలానే ఉన్నారు

డైరెక్టర్ అండ్ టీమ్

మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ లో ఒక ప్రత్యేక ముద్ర కలిగిన దర్శకుడు బోయపాటి శీను ప్రాధమిక ఫిజిక్స్ సూత్రాలను, గ్రావిటీ అంశాలను అసలు పట్టించుకోరన్న కామెంట్ ఉంది. అఖండలో కూడా అదే జరిగింది. ఇలాంటి కథల్లో లాజిక్స్ అవసరం లేదు. అలా లీనమైపోయేలా గూస్ బంప్స్ ఎపిసోడ్స్ నాలుగైదు పెట్టేస్తే చాలు. వాటికి కాసింత ఎమోషన్, సెంటిమెంట్ జోడిస్తే ఖేల్ ఖతం. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్టు. భద్ర, తులసి, సింహా, లెజెండ్ లో ఆయన చేసింది ఇదే. ఇక్కడా అదే కొనసాగించారు. తన నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో ముందే ప్రిపేర్ అయ్యారు కాబట్టి దాన్నుంచి బయటికి రావడం ఇష్టం లేదన్నట్టుగా పాత స్కూల్ నే ఫాలో అయ్యారు.

ఒక పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో. అతనికి ధీటుగా సవాళ్లు విసిరే క్రూరమైన ఒకరిద్దరు విలన్లు. నో చట్టం. నో గవర్నమెంట్. స్టోరీ ఎక్కడ నడిచినా అక్కడ వయొలెన్స్ తప్ప డెమోక్రసీ ఉండదు. ఇలా కూడా మనుషులను చంపేస్తారా అనిపించేలా కొన్ని సన్నివేశాలు. ఫైనల్ గా హీరో చేతిలో దుర్మార్గుల శత్రు సంహారం. అఖండలో కూడా ఇదే తంతు చూపించారు బోయపాటి. వీటిని దాటి బయటికి వస్తే సినిమాను రిసీవ్ చేసుకోరన్న భయమో అనుమానమో ఎలాంటి ప్రయోగాలు చేయనివ్వకుండా అడ్డు పడుతోంది. ఒకరకంగా ఇదే అఖండకు ప్లస్ గా మారితే అంతకన్నా ఎక్కువ మోతాదులో మైనస్ అయ్యింది. ఫ్యాన్స్ సంతృప్తి చెందటం కాసేపు పక్కన పెడదాం.

ఈసారి అఘోరా అనే బ్యాక్ డ్రాప్ తో పాటు హిందుత్వ సిద్ధాంతాలను అఖండ పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేసిన బోయపాటి విపరీతమైన హింసతో దాన్ని పూర్తి స్థాయిలో కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. రెండో పాత్రను డమ్మీగా మార్చేసి సెకండ్ హాఫ్ ని పూర్తిగా అఖండ ఓవర్ ఎలివేషన్స్ తో నింపేయడం మొదటిసారి చూస్తున్నప్పుడు ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించవచ్చు కానీ రిపీట్ వేల్యూ కోణంలో చూసుకుంటే మళ్ళీ భరించగలమా అనే ప్రశ్న తలెత్తుతుంది. లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ లో సరైన రీతిలో భావోద్వేగాలు ఉంటాయి. మోతాదులో హెచ్చు తగ్గులున్నా ఫ్యామిలీ ఆడియన్స్ ని సంతృప్తి పరిచే అంశాలు ఉంటాయి.

కానీ అఖండలో ఇవి పూర్తి స్థాయిలో లేవు. కెజిఎఫ్ రేంజ్ లో హీరోయిజం తెరమీద పండిన మాట వాస్తవం. దానికి తమన్ టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై సీన్స్ స్థాయిని పెంచాయి. కానీ వాటికి తగ్గ డ్రామా పూర్తి స్థాయిలో లేదు. ఫస్ట్ హాఫ్ లో మురళి, శరణ్య మధ్య లవ్ ట్రాక్ చప్పగా సాగుతుంది. బలవంతంగా అతికించి రెండు పాటలు కూడా పెట్టారు. ఇదంతా ఇంటర్వెల్ దాకా అఖండని రానివ్వకుండా చేసి టైం పాస్ చేసే వ్యవహారం. ఒక్కసారి ఆ పాత్ర ఎంటరయ్యాక ఆ బలహీనతను కవర్ చేసే ప్రయత్నం గట్టిగా జరిగింది. అందులో బోయపాటి గ్రాఫ్ ని కిందకు పైకి తీసుకెళ్లినా కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాడు. అదే దీనికి శ్రీరామరక్ష.

కేవలం మాస్ ని మెప్పించేందుకు సినిమా తీసినప్పుడు అందులో ధర్మ రక్షణ పేరుతో జొప్పించిన సీన్లలో సంభాషణలు బాగున్నప్పటికే అవి అసలు కథకు అంతగా సింక్ కాక కేవలం లెన్త్ కోసమే జోడించినట్టు అనిపిస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ఇంకొంచెం బలంగా కథాకథనాలు కనక రాసుకుని ఉంటే ఇది వేరే లెవెల్ లో ఉండేది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్ లలో ఉన్నది అఖండలో లేనివి రెండు. ఒకటి హత్తుకునే సెంటిమెంట్ ప్లస్ ఎమోషన్. రెండు కట్టిపడేసే డ్రామా. వాటిలో లేనిది ఇందులో ఉన్నది ఒక్కటి. అభిమానులు ఈలలు కేకలు వేసే ఎలివేషన్. రెండోది చాలనుకుంటే అఖండను చూసేయొచ్చు

తమన్ కాకుండా ఇంకెవరు దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినా అఖండ ఈ స్థాయిలో ఉండేది కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని చోట్ల సౌండ్ ఎక్కువైనా ఓవరాల్ గా బీజీఎమ్ తో అదరగొట్టాడు. పాటలు మరీ గొప్పగా లేవు కానీ విజువల్ గా బాగున్నాయి అంతే. సి రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం బాలయ్య తీక్షణతను, నటనను సంపూర్ణంగా చూపించింది. యాక్షన్ బ్లాక్స్ లో పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వరరావు- తమ్మిరాజుల ఎడిటింగ్ లెన్త్ మీద కరెక్ట్ ఫోకస్ పెట్టి ఉంటే ల్యాగ్ తగ్గి వేగం పెరిగేది. ప్రకాష్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మాణ విలువల్లో రాజీ లేదు

ప్లస్ గా అనిపించేవి

అఖండగా బాలకృష్ణ
తమన్ బిజిఎమ్
యాక్షన్ ఎపిసోడ్స్
ఇంటర్వెల్ బ్లాక్

మైనస్ గా తోచేవి

రెండో బాలయ్య పాత్ర
లవ్ ట్రాక్
కాస్త ఎక్కువైన ఎలివేషన్లు
ఫస్ట్ హాఫ్

కంక్లూజన్

ఎంత ఊర మాస్ ఎంటర్ టైనరైనా కథా కాకరకాయ్ అక్కర్లేదు అనుకుంటే పొరపాటే. ఫ్యాన్స్ ఇలాంటివి ఎలా ఉన్నా క్షమిస్తారు కానీ సాధారణ ప్రేక్షకులను మెప్పించే విషయంలో మాత్రం\ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వినయ విధేయ రామలో ఈ సూత్రాన్ని పూర్తిగా పక్కనపెట్టేసి దెబ్బ తిన్న బోయపాటి అఖండలోనూ పూర్తిగా మారే ప్రయత్నం చేయలేదు కానీ ఉన్నంతలో దాని కన్నా బెటర్ అనిపించే అవుట్ ఫుట్ ఇచ్చారు తప్ప లెజెండ్ ని మించేలా అని మాత్రం మేజిక్ చేయలేకపోయారు. అయినా కూడా ఇంత లేట్ ఏజ్ లోనూ బాలయ్య పడుతున్న కష్టానికి, ఫ్యాన్స్ కోసం చూపిస్తున్న డెడికేషన్ కి అఖండని వన్ టైం ఛాయస్ గా పెట్టుకోవచ్చు

ఒక్కమాటలో – మసాలా 70 మ్యాటర్ 30

Anubhavinchu Raja Review : అనుభవించు రాజా రివ్యూ 

Show comments