iDreamPost
android-app
ios-app

ఇంతకీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ లో ఏముంది

  • Published Feb 23, 2020 | 12:37 PM Updated Updated Feb 23, 2020 | 12:37 PM
ఇంతకీ  ‘డ్రైవింగ్ లైసెన్స్’ లో ఏముంది

ఇంకా అధికారికంగా తెలియకపోయినా లేటెస్ట్ మలయాళం సూపర్ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కులు రామ్ చరణ్ తీసుకున్నాడన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పాత్ర కోసం వెంకటేష్ ను సంప్రదించినట్టుగా వచ్చిన టాక్ దీనికి వేడిని రాజేస్తోంది. అంతగా ఈ సినిమాలో ఏముందన్న ఆసక్తి ఇప్పుడు సాధారణ ప్రేక్షకుల్లోనూ వ్యక్తమవుతోంది. విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్న కేరళ సినిమా నుంచి వచ్చిన మరో చక్కని చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పొచ్చు. అసలింతకీ ఇందులో ఏముందో ఒక లుక్ వేద్దాం.

మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ కురువిల్లా జోసెఫ్(సూరజ్)స్టార్ హీరో హరీంద్రన్ (పృథ్విరాజ్)కు వీరాభిమాని. ఒక షూటింగ్ కోసం హరీంద్రన్ కు అప్పటికే పోగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్స్ పాత డేట్ మీద అవసరమవుతుంది. రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే జోసెఫ్ తన హీరో కోసం వాటిని సడలించి ఇస్తానని ఒప్పుకుంటాడు. అయితే హరీంద్రన్ ఓసారి ఆఫీస్ కు వచ్చి స్వయంగా తీసుకుని ఫోటో తీసుకోవాలని మధ్యవర్తిగా వచ్చిన హీరో ఫ్రెండ్ ని కోరతాడు. దానికతను సరేనని ఒప్పుకుంటాడు.

ఆర్టిఓ ఆఫీస్ క్లర్క్ లీక్ వల్ల హరీంద్రన్ లైసెన్స్ కోసం వస్తున్న విషయం మీడియాకు తెలిసిపోయి అందరూ ఆఫీస్ దగ్గర గుమికూడతారు. ఇదంతా జోసెఫ్ వల్లే జరిగిందని అపార్థం చేసుకున్న హరీంద్రన్ అతని మీద కేకలు వేసి తిడతాడు. దీంతో ఈగో హర్ట్ అయిన జోసెఫ్ హరీంద్రన్ తో సై అంటే సై అనే సవాల్ కు సిద్ధపడతాడు. అన్ని టెస్టులు పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తానని మెలిక పెడతాడు. దీంతో ఎన్నో ఆసక్తికరమైన మలుపుల తర్వాత హరీంద్రన్ ఫ్యాన్స్ జోసెఫ్ మీద దాడి చేసే దాకా వస్తుంది పరిస్థితి. హీరోకి అభిమానికి మధ్య మొదలైన చిన్న తగవు పెద్ద గొడవ దాకా ఎలా వెళ్ళింది, చివరికి ఇద్దరూ కలిసిపోయారా లేదా అనేదే అసలు కథ.

దర్శకుడు లాల్ జూనియర్ కట్టిపడేసే టేకింగ్ తో పాటు చాలా మెచ్యూర్డ్ గా అనిపించే ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా సూరజ్, పృథ్విరాజ్ ల మధ్య క్లాష్ ఈ సినిమాకు ఆయువు పట్టు. రెండున్నర గంటలు చిన్న పాయింట్ మీద పాటలు లేకుండా నడపటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. హీరోల మీద అభిమానుల విపరీత ప్రవర్తన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చక్కగా చూపించారు.

సెంటిమెంట్, ఎమోషన్స్ తో పాటు కావాల్సినంత యాక్షన్ కూడా అవసరం మేరకు జొప్పించారు. దీనికి గ్యారీ-నేహాల సంగీతం కూడా బాగా దోహదపడింది. అక్కడక్కడా కొంత డ్రామా శృతిమించినట్టు అనిపించినా ఆ తర్వాత సన్నివేశాలతో వాటిని మరిపించేలా చేయడం లాల్ జూనియర్ మార్కు పనితనం. మొత్తానికి తెలుగు రీమేక్ కు సరిపడా మెటీరియల్ అయితే ఇందులో పుష్కలంగా ఉంది. కాకపోతే హరీంద్రన్, జోసెఫ్ పాత్రలు తెలుగులో ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు భేతాళ ప్రశ్నగా నిలిచింది