బాలయ్య కేవలం గోలయ్యగా మిగిలిపోయారు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుడు. అంతకుముందు టాలీవుడ్ లో ఓ హీరో. అటు పరిశ్రమ, ఇటు సొంత రాష్ట్రం ప్రయోజనాల కోసం చొరవ చూపాల్సిన బాధ్యత ఉన్న నాయకుడు. కానీ ఆయన దానిని విస్మరించారు. కనీసం స్పందించలేదు. సరికదా చొరవ తీసుకుని షూటింగులకు అనుమతి సహా పలు సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసేందుకు చేసిన ప్రయత్నాలపై కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చేయకపోగా చేస్తున్న వారి మీద నిందలు వేసే ప్రయత్నం చేయడాన్ని కొందరు తప్పుబట్టారు. అదే సమయంలో తెలంగాణా సీఎంని కలిసిన సమయంలో తనను ఆహ్వానించలేదని, పిలిస్తే వెళ్లేవాడినని అన్నారు.

అదంతా జరిగి వారం రోజులు గడవకముందే అదే సినీ రంగ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చి అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. సీఎం జగన్ తో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. పలు అంశాలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించడం, దానికి ఆయన సానుకూలంగా స్పందించడంతో పరిశ్రమ పెద్దలు సంతోషంతో వెనుదిరిగారు. ఇక ఈ సమావేశానికి హిందూపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్న బాలకృష్ణకు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. ఆయన షెడ్యూల్ ను సర్థుబాటు చేసుకునేందుకు అనుగుణంగా తగిన సమయం ఉండడంతో ఆయన కూడా పరిశ్రమ పెద్దలతో చేతులు కలుపుతారని అంతా భావించారు. ముఖ్యంగా కేసీఆర్ ని కలిసినప్పుడు తనను పిలవలేదని చెప్పిన బాలయ్య, ఈసారి ముందస్తుగా అందిన ఆహ్వానంతో సానుకూలంగా స్పందిస్తారని భావించారు.

కానీ ఆశించినదానికి భిన్నంగా ఆయన వ్యవహారం ఉంది. బాలయ్య కేవలం గోలయ్యగానే మిగిలిపోయారు. తనను పిలవలేదని గోల పెట్టి, తీరా పిలిచిన తర్వాత మొఖం చాటేయడం విస్మయకరంగా మారింది. బాధ్యత గల ఎమ్మెల్యేగా తన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి సొంత ఇండస్ట్రీ ప్రముఖులు వస్తున్నప్పుడు ముందు ఉండాల్సింది పోయి ఆహ్వానించినా హాజరుకాకపోవడం గమనిస్తే ఆయన చిత్తశుద్ధి అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన చర్యలో బాలకృష్ణ బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఆయనకు మంచి గుర్తింపు వచ్చేది. ఇప్పటికే కరోనా కరాళ నృత్యం చేస్తున్నా లాక్ డౌన్ వేళ తన సొంత నియోజకవర్గ ప్రజలను కనీసం పలకరించడానికి కూడా తీరిక లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఇప్పుడు తన పరిశ్రమ ప్రముఖులకు తోడ్పాటుగా నిలిచేందుకు కూడా సిద్ధపడలేదు. పైగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగన్ తన అభిమాని అని చెప్పుకునే చాలామందిని ఆశ్చర్యపరిచిన బాలయ్య, మరింత ముందుకు రావాల్సి ఉండగా ఎందుకు దూరమయ్యారన్నది అంతుబట్టడం లేదు.

సినీ రంగంలో సుదీర్ఘకాలంగా ఉన్న బాలకృష్ణ ఇలాంటి బాధ్యతరాహిత్యంగా స్టేట్ మెంట్లు ఇవ్వడం, తీరా అవకాశం వచ్చినప్పుడు జారిపోవడం చూసిన తర్వాత ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తోంది. ఇలాంటి తీరు ఉన్న ఇండస్ట్రీలోనూ ఇటు ప్రజల్లో కూడా పరువు కోల్పోయే పరిస్థితి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాలయ్య తన హోదా మరచి వ్యవహరించడం మూలంగా రానురాను పలుచనయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Show comments