iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ త‌ర్వాత కూడా స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ప్ర‌ధాని సూచ‌న‌

  • Published Apr 02, 2020 | 11:59 AM Updated Updated Apr 02, 2020 | 11:59 AM
లాక్ డౌన్ త‌ర్వాత కూడా స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని  ప్ర‌ధాని సూచ‌న‌

దేశంలో క‌రోనా స‌మ‌స్య నుంచి గట్టెక్కేందుకు అంతా ఉమ్మ‌డిగా ప్ర‌య‌త్నిద్దామ‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. లాక్ డౌన్, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ముఖ్య‌మంత్రులు ఆయా రాష్ట్రాల ప‌రిస్థితిని పీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నిజాముద్దీన్ మ‌ర్కాజ్ కి సంబంధించిన వారి వివ‌రాల‌ను అందించారు. కేసులు పెర‌గ‌కుండా తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు వివ‌రించారు ఆయా రాష్ట్రాల‌కు అవ‌స‌ర‌మైన రీతిలో మెడిక‌ల్ కిట్లు, ఇత‌ర సామాగ్రి పంపించాల‌ని విన్న‌వించారు. ఆర్థికంగా ఆదుకునేందుకు నిధులు కూడా కేటాయించాల‌ని కోరారు. ఏపీ సీఎం జ‌గ‌న్ స‌హా అనేక మంది ఈ అంశాల‌ను ప్ర‌స్తావించారు.

సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఏపీలో వాలంటీర్ల స‌హయంతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. రెండు సార్లు స‌ర్వే చేసి స‌మ‌గ్ర వివ‌రాలు సేక‌రించామ‌న్నారు. నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు లేకుండా చూస్తున్న‌ట్టు వివ‌రించారు. ఫిబ్రవరి 10, 2020 నుంచి ఇప్పటివరకూ 27,876 మందికిపైగా విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చిన‌ట్టు వెల్ల‌డించారు. వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మందికాగా 17,336 మంది రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నార‌ని తెలిపారు. వారికి ప్రైమరీ కాంటాక్ట్స్‌ 80,896 మంది ఉన్నారని వారంద‌రినీ పూర్తి పర్యవేక్షణలో ఉంచిన‌ట్టు వివ‌రించారు. తబ్లిగీ జమాతేకు హాజరైన 1085 మంది గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయిస్తున్నామ‌న్నారు. ఏపీలో ఇప్పటివరకూ 132 మందికి కోవిడ్‌ –19 సోకిందని, అందులో 111 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవార‌ని తెలిపారు. 91 మంది తబ్లీగ్‌జమాతేకు వెళ్తే, మరో 20 మందికి కాంటాక్ట్‌ కావడంద్వారా ఈ వైరస్‌ సోకిందని, దాంతో క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీని పాటిస్తున్నామ‌ని జ‌గ‌న్ తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఈనెలలో ఇవ్వాల్సిన జీతాల్లో యాభైశాతం వాయిదా వేశామ‌ని ముఖ్యమంత్రి జగన్ ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. తాజా ప‌రిణామాల‌తో రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం అనుకోకుండా ఖర్చులు పెరిగాయని జ‌గ‌న్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నందున కేంద్రం త‌గిన రీతిలో ఆదుకోవాల‌ని కోరారు.

ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ లాక్ డౌన్ లిఫ్ట్ చేసిన త‌ర్వాత ఒక్క‌సారిగా అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. అలాంటి స‌మ‌యంలో వైర‌స్ మ‌రింత వేగంగా విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ముంద‌స్తుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఒక్క‌రి ప్రాణ‌న‌ష్టం కూడా జ‌ర‌గ‌కుండా నివారించేందుకు త‌గిన ప్ర‌య‌త్నాలు చేయాల‌న్నారు. అన్ని రాష్ట్రప్ర‌భుత్వాలు ఉమ్మ‌డిగా వ్యూహాలు చేయాల‌ని కోరారు. ఇప్ప‌టికే అలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అభినందించారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో వివిధ వ‌ర్గాల‌ను భాగ‌స్వాములు చేయాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా ఎన్జీవోలు, సామాజిక బృందాల‌ను క‌లుపుకుని పోవాల‌న్నారు. కోవిడ్ వైర‌స్ విస్తృతి త‌గ్గించే ప్ర‌య‌త్నంలో ఉన్న వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ స‌మావేశంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్, జ‌గ‌న్ త‌మ రాష్ట్రాల ప‌రిస్థితిని వివ‌రించారు. ఆర్థికంగా ఆదుకునేందుకు నిధులు కేటాయించాల‌ని కోరారు.