విజయేంద్రులకు రాజ్యసభ – సోషల్ మీడియా రగడ

అసలు రాజ్యసభకు నామినేషన్ అందుకోవాలంటే కావాల్సిన అర్హతేంటి. ఆ పదవి వచ్చాక దేశం పట్ల సమాజం పట్ల మనకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న చర్చ. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతటి ఉన్నతమైన గౌరవానికి ఆయన అర్హుడని బిజెపి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుందనే కోణంలో పెద్ద పోస్ట్ మార్టమే జరుగుతోంది. ఇళయరాజా గురించి ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత కనిపించడం లేదు. మాస్ట్రో పట్ల దేశవ్యాప్తంగా ఉన్న అపారమైన గౌరవం ఆ స్థాయిలో ఉంది. కానీ పైన చెప్పిన పెద్దాయన కేసు వేరు.


ప్రధాని నరేంద్ర మోడీ విజయేంద్ర ప్రసాద్ దేశ సంస్కృతికి ఎంతో తోడ్పడ్డారన్న ఉద్దేశంలో ట్విట్ చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. అసలు ఇంతకీ ఆయన కథలు అందించిన సినిమాల సదరు పార్టీ వర్గాల్లో ఒకరికైనా తెలుసో లేదో. సమరసింహారెడ్డి, ఘరానా బుల్లోడు, బొబ్బిలి సింహం, సింహాద్రి, విక్రమార్కుడు లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫక్తు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు. పోనీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు తీసుకున్నా అవి పూర్తిగా కల్పనల ఆధారంగా రూపొందిన విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాలు. ఇక మిత్రుడు, జాగ్వార్, విజయేంద్రవర్మ లాంటి మాస్టర్ పీసుల గురించి వీలైనంత తక్కువ చెప్పుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ట్రిపులార్ లో మరీ అన్యాయంగా అల్లూరి, కొమరం భీంల పేర్లను హీరోలకు వాడేసి చరిత్రను ఇప్పటి తరం కన్ఫ్యూజ్ అయ్యేలా చరిత్రను వక్రీకరించారన్న కామెంట్లు ముందు నుంచే ఉన్నాయి. ఇలాంటి రచనలు చేసిన ఒక కమర్షియల్ రైటర్ కు ఈ పదవి ఇస్తారా అనే ప్రశ్నకు బదులు దొరకదు. జంధ్యాల, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, ఎంఎస్ హరినాథరావు లాంటి వాళ్ళు ఏనాడూ ఈ తరహా గుర్తింపు నోచుకోలేదు. ఇంకా చెప్పలంటే సంప్రదాయాలు, సంస్కృతి లాంటి వాటిని వెండితెరపై బ్రతికించిన కె విశ్వనాధ్ కు ఎవరూ ఈ ప్రతిపాదన చేయలేదు. మరి విజయేంద్రప్రసాద్ కే ఎందుకన్న వాదనకు స్పష్టమైన సమాధానం ఎవరూ చెప్పలేరు.

Show comments