iDreamPost
android-app
ios-app

ఇన్నాళ్లు త్రిష‌కి ఈ విష‌యం తెలియ‌దా?

ఇన్నాళ్లు త్రిష‌కి ఈ విష‌యం తెలియ‌దా?

చిరంజీవి సినిమా నుంచి త్రిష త‌ప్పుకుంది. కార‌ణం మొద‌ట చెప్పిన క‌థ‌కి , త‌ర్వాత జ‌రుగుతున్న దానికి తేడా ఉండ‌ట‌మే. దీన్ని సృజ‌నాత్మ‌క విభేదంగా త్రిష కొత్త పేరు పెట్టింది. నిజానికి మ‌న సినిమాల‌న్నీ హీరో ఒరియెంటెడ్ మాత్ర‌మే. హీరోయిన్‌కి ప్రాధాన్య‌త ఉన్న సినిమాలు త‌క్కువ‌. ఇన్నేళ్లు ఫీల్డ్‌లో ఉన్న త్రిష‌కి ఈ విష‌యం తెలియ‌కుండా ఉండ‌దు. అందులోనూ చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ డ‌మ్మీనే. సైరాలో త‌మ‌న్నా, న‌య‌న‌తార‌ల ప‌రిస్థితి చూశాం క‌దా!

విష‌యం ఏంటంటే డైరెక్ట‌ర్లు హీరోల కోసమే క‌థ త‌యారు చేస్తారు. మిగ‌తా క్యారెక్ట‌ర్ల‌కి, హీరోయిన్‌కి అయినా స‌రే ఇంపార్టెన్స్ ఉంటే వాళ్ల‌కు న‌చ్చ‌దు. హీరోయిన్ ఊరికే పాట‌ల‌కి, ఏదో పిచ్చి స‌న్నివేశాల‌కి ఉండాలి. ఆమె మీద ఎక్కువ సీన్స్ ఉంటే కూడా ఇబ్బందిగా చూస్తారు. హీరోల కోసం పెద్ద డైరెక్ట‌ర్లు కూడా ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూడాల్సిన ఈ స్థితిలో, ఆయ‌న్ని కాద‌నుకునే ధైర్యం ఉండ‌దు. అవ‌స‌ర‌మైతే క‌థ‌ని మారుస్తారు.

అయితే హీరోయిన్‌కి నేరేష‌న్ ఇచ్చేట‌ప్పుడు ఆమెది చాలా Imoprtant Role అని డైరెక్ట‌ర్లు బిల్డ‌ప్ ఇస్తారు. ఇది కొంత మంది న‌మ్ముతారు. మ‌రికొంద‌రు న‌మ్మిన‌ట్టు న‌టిస్తారు. త్రిష , న‌య‌న‌తార‌, అనుష్క‌, కీర్తిసురేష్ ఈ రేంజ్ వాళ్ల‌కు త‌ప్ప అంద‌రికీ క‌థ న‌చ్చ‌లేద‌ని సినిమాని రిజ‌క్ట్ చేసే ప‌రిస్థితులుండ‌వ్‌.

ఒక‌సారి షూటింగ్‌కి వ‌చ్చిన త‌ర్వాత చాలా జాగ్ర‌త్త‌గా Observe చేస్తే త‌ప్ప క‌థ‌లో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డం క‌ష్టం. చిన్న‌చిన్న Bits గా సినిమా తీస్తారు కాబ‌ట్టి ఆ కంటిన్యూటీ డైరెక్ట‌ర్‌కే స్ప‌ష్టంగా తెలుస్తుంది. మిగ‌తా వాళ్లు తెలుసుకోలేరు.

షూటింగ్ అయిపోయి ఎడిటింగ్‌లో క‌త్తిరింపులు త‌ర్వాత ఎక్కువ‌గా హీరోనే మిగులుతాడు. ఫైన‌ల్ కాపీ చూసిన త‌ర్వాత హీరోయిన్లు బావుర‌మ‌న్న సంఘ‌ట‌న‌లున్నాయి. అయితే డ‌బ్బు తీసుకున్న త‌ర్వాత మాట్లాడ‌టానికి ఏముంది? డైరెక్ట‌ర్ నాకు చెప్పిందొక‌టి, తీసిందొక‌టి అని గొడ‌వ ప‌డితే, త‌ర్వాత వ‌చ్చే అవ‌కాశాలు కూడా రావు.

త్రిష ఏమైనా ధైర్య‌మైన అమ్మాయి. ఒక‌సారి సోష‌ల్ మీడియాలో ఆమెపైన దాడి జ‌రిగిన‌ప్పుడు ధైర్యంగా ఎదుర్కొని , త‌న‌మీద మార్పింగ్ వీడియో తీశార‌ని పోలీసుల‌కి ఫిర్యాదు కూడా ఇచ్చింది. చిరంజీవి సినిమాని షూటింగ్ ద‌శ‌లో వ‌దులుకోవాలంటే గ‌ట్స్ కావాలి. త్రిష గొప్ప న‌టి. వ్య‌క్తిత్వం ఉన్న న‌టి కూడా.