iDreamPost
iDreamPost
గతమెప్పుడూ తీయని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందులోనూ సినిమాకు సంబంధించినది అయితే ఇక దాని గురించి చెప్పేదేముంది. ఇక్కడ మీరు చూస్తున్న పిక్ అలాంటిదే. ఇందులో ముగ్గురు హీరోలు ఒక దర్శకులు(తర్వాత ఆయనా హీరో అయ్యారు లెండి) ఉన్నారు. కాకపోతే ఒకే మూవీ కోసం కలుసుకున్న సందర్భం అయితే కాదు. అనుకోకుండా జరిగిందిది. 1994లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాషా’, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తీస్తున్న ‘టాప్ హీరో’, దాసరి గారు మల్టీ స్టారర్ గా సుమన్ ని అభిమన్యుడిగా చూపిస్తూ క్లాసిక్ టైటిల్ తో నిర్మిస్తున్న ‘మాయాబజార్’ మూడు సినిమాలు హైదరాబాద్ లోని ఒకే స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.
అనుకోకుండా అలా జరిగిపోవడంతో అందరూ ఇలా ఒకేచోట కలుసుకున్నారు. స్పాట్ మాత్రం దాసరి గారి మూవీదే. అప్పట్లో సుమన్ కు సైతం మంచి క్రేజ్ ఉండేది. ఇలా ముగ్గురు హీరోలు ఒకేచోట కలుసుకోవడం అందులోనూ కాకతాళీయంగా జరగడం విశేషమే. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. బాషా తమిళ్ సినిమా. తెలుగులో డబ్ చేశారు. రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ బాషా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా అభిమానులు చెప్పుకుంటారు. బాలయ్య టాప్ హీరో మ్యూజికల్ గా రిలీజ్ కు ముందే సూపర్ హిట్టయ్యింది కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం నిరాశ కలిగించింది.
ఎస్వి లాంటి దర్శకుడు స్టార్ ఇమేజ్ ని మోయలేకపోయారని కామెంట్స్ వచ్చాయి. ఇందులో సౌందర్య హీరోయిన్. ఇక దాసరి గారి మాయాబజార్ వీటన్నింటి కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొంది కోరుకున్న ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. తెరనిండా ఆర్టిస్టులతో ఎంత కలర్ ఫుల్ గా తీసినా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. ఇలా ముగ్గురిలో డబ్బింగ్ రూపంలో రజిని బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మిగిలిన స్ట్రెయిట్ హీరోలు చేదు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. కానీ బాషాకు దేవా, మాయాబజార్ కు మాధవపెద్ది సురేష్, టాప్ హీరోకు ఎస్వి సంగీతం ఆ టైంలో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పటికీ రజని, బాలయ్యలు హీరోలుగా కొనసాగుతుండగా చాలా కాలం క్రితమే సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారు.