కంటెంట్ కోసం టాలీవుడ్ వేట

కరోనా సంఘానికే కాదు సినిమా పరిశ్రమకూ బోలెడు పాఠాలు నేర్పించేసింది. ఇకపై ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించే బడ్జెట్లు ఉండకపోవచ్చు. స్టార్ల రెమ్యునరేషన్లకు కోతలు పడవచ్చు. విదేశాల్లో నడిచే కథలకు గుడ్ బై చెప్పొచ్చు. ఔట్ డోర్ షూటింగులు వద్దనే డిమాండ్లు పెరగొచ్చు. ఇంకా చాలా చాలానే మార్పులు చూడబోతోంది పరిశ్రమ. ముఖ్యంగా కొత్త టాలెంట్ కు దారులు తెరవబోతున్నారు. నిర్మాతల ఇళ్ళు, ప్రొడక్షన్ హౌసుల ఆఫీసుల చుట్టూ తిరిగే యాతన న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ కు తప్పనుంది. ఆ మేరకు డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న నిర్మాణ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఎవరి దగ్గరైనా కొత్త కథలు, స్క్రిప్ట్ లు ఉంటే కనక వాటిని అధికారికంగా తమకు పంపించి ఒకవేళ లిమిటెడ్ బడ్జెట్ లో కనక వాటిని పూర్తి చేయగలిగే అవకాశం ఉంటే కనక రచయితలుగానో దర్శకులు గానో ఆఫర్ ఇవ్వడానికి అవి తలుపులు తెరవనున్నాయి. ఓటిటి విప్లవం పుణ్యమాని వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కంటెంట్ వి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సెన్సార్ లేకపోవడం, థియేట్రీకల్ రిలీజులో ఉండే సవాలక్ష ఇబ్బందులు, ఖర్చులు ఇందులో లేకపోవడం లాంటి కారణాల వల్ల అధిక శాతం వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

నిన్న నటుడు రాజా రవీంద్ర ఓ వీడియో ద్వారా ఫిల్మ్ మేకర్స్ కి ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చి ఐడియాలు, కథలు ఉంటే వాట్సాప్ చేయమని పిలునిచ్చారు. రిస్క్ లేకుండా నేరుగా ఇలాంటి పద్ధతిని ఆశ్రయించడం మంచిదే. ఒకవేళ పంపించిన ప్లాట్ కనక వాళ్లకు నచ్చితే వ్యక్తిగతంగా కలవమని చెబుతారు. దీని వల్ల రెండు వైపులా శ్రమ తగ్గుతుంది. యువి, గీతా లాంటి కంపెనీలు ఇప్పటికే ప్లానింగ్ తో ఉండగా త్వరలో దిల్ రాజు, సురేష్ బాబులు కూడా రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఇంకేం వర్ధమాన రచయితలు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న క్రియేటివ్ డైరెక్టర్లు ఎవరన్నా సరే వాళ్లకు ఇది బంగారం లాంటి సమయం. సరైన దిశగా వెళ్లి మంచి కంటెంట్ తో మెప్పిస్తే త్వరగానే టాలీవుడ్ లోకి ఎంటరైపోవచ్చు.

Show comments