iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచిన టాలీవుడ్

విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచిన టాలీవుడ్

తనపై అసత్య కథనాలను ప్రచురించిన వెబ్సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండకు సినీ పరిశ్రమ మద్దతుగా నిలిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్ కి మద్దతుగా ఉంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను తన కుటుంబం కూడా ఇలాంటి అసత్య కథనాల వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయని తన సపోర్ట్ విజయ్ దేవరకొండకు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి విజయ్ దేవరకొండ 25 లక్షల మూలధనంతో ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. అనేకమంది విజయ్ ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కు స్వచ్చందంగా విరాళాలు ఇచ్చారు. కాగా కొన్ని వెబ్సైట్లు తన గురించి తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ గురించి అసత్య కథనాలు ప్రచురించాయి. ఆ కథనాలను ఖండించిన విజయ్ దేవరకొండ వాటి తీరును దుయ్యబట్టారు. అలాంటి వెబ్సైట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని అలాంటి వెబ్సైట్లలో వచ్చే కథనాలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.

విజయ్ దేవరకొండకు సినీ పరిశ్రమనుండి అనూహ్య మద్దతు లభించింది. మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ కు “నీకు అండగా నేను ఉన్నాను బ్రదర్” అని మద్దతును తెలిపారు. తర్వాత రవితేజ, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, మధుర శ్రీధర్, రానా దగ్గుబాటి, బీవీఎస్ రవి, రాశీ ఖన్నా వంటి వారందరూ విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు చలన చిత్ర నిర్మాతల మండలి విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచింది. అసత్య కథనాలను ప్రచురించే వెబ్సైట్లపై చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఎవరైనా అసత్య కథనాలను ప్రచురించే వెబ్సైట్లపై పిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్మాతల మండలి తెలిపింది. తన స్తోమతను బట్టి ఎవరైనా సహాయం చేస్తారని.. వాటిపై కూడా అసత్య కథనాలు ప్రచురించడం కరెక్ట్ కాదని లాక్ డౌన్ పూర్తయిన తర్వాత అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని నిర్మాతల మండలి వెల్లడించింది.