జాతీయ స్థాయిలో నేడు ప్రతిపక్ష పార్టీల భేటీ – 20 పార్టీల నేతలు హాజరు

దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కట్టడిలో కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు నేడు భేటీ కానున్నాయి. వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో దాదాపు 20 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ సమన్వయం చేస్తున్నారు. మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఈ రకమైన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి. ఈ సమయంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు ముందుకు వెళ్లే మార్గం గురించి ఆయా పార్టీల అగ్ర నేతలు చర్చిస్తారు.

ఈ సమావేశానికి 20 పార్టీలు హాజరవుతామని తెలపగా, మూడు బిఎస్‌పి, ఆప్‌, ఎస్పీ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుండి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపక్షాల సంయుక్త సమావేశానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజానుకూల ఆర్థిక ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు ఒక కామన్‌ వేదిక కనుగొనేందుకు అందరూ కలిసి రావాలని సోనియా గాంధీ, స్టాలిన్‌లతో సహా ప్రతిపక్ష నేతలందరికీ సీతారాం ఏచూరి లేఖ రాశారు. ఇదే ప్రస్తుత సమావేశం ఏర్పాటుకు ఒక కారణం.

సమావేశంలో పాల్గొననున్న పార్టీలు, నేతలు

వీడియో కాన్ఫరెన్స్‌లో సోనియా గాంధీ (కాంగ్రెస్‌), శరద్‌ పవార్‌ (ఎన్‌సిపి), సీతారాం ఏచూరి (సిపిఎం), డి.రాజా (సిపిఐ), ఉద్దవ్‌ ఠాక్రే (శివసేన), మమతా బెనర్జీ (టిఎంసి), ఎంకె స్టాలిన్‌ (డిఎంకె), హేమంత్‌ సోరెన్‌ (జెఎంఎం), తేజశ్వి యాదవ్‌ (ఆర్‌జెడి), హెచ్ డి దేవగౌడ (జెడిఎస్), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అజిత్‌ సింగ్‌ (ఆర్‌ఎల్‌డి), శరద్‌ యాదవ్‌ (ఎల్‌జెడి), జితిన్‌ మాంఝీ (హెచ్‌ఎఎం), ఉపేంద్ర కుష్వాహా (ఆర్‌ఎల్‌ఎస్‌పి), రాజు శెట్టి (స్వాభిమాన్‌ పక్ష), పికె కున్హాల కుట్టీ (ఐయుఎంఎల్‌) తదితరులు ఉన్నారు. ఎఐడియుఎఫ్‌, కేరళ కాంగ్రెస్‌, ఆర్‌ఎస్‌పి తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు.

ఈ అంశాలపై చర్చ

“దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి. కేంద్ర ప్రభుత్వ స్పందన. లాక్‌డౌన్‌ ముందు, తరువాత పరిణామాలు. వలస కార్మికుల సమస్యలు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. నిరుద్యోగ సమస్య. సరిపోని కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో సమాఖ్య వ్యవస్థ నిర్మాణాన్ని ఖూనీ చేసిన విధానం. కార్మిక చట్టాల రద్దు. ఆర్థిక సేకరణతో సహా షరతులతో కూడిన 5 శాతం లోటు పరిమితి” తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాల్సి చర్యలు

”కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలి. ఆరు నెలల పాటు ప్రతి ఒక్కరికి పది కేజీల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వాలి. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధాన నిర్ణయాలు ముఖ్యంగా, కార్మిక చట్టాల రద్దును వెనక్కి తీసుకోవాలి. మద్దతు ధరతో రబీ పంటను, చిన్న అటవీ ఉత్పత్తులను వెంటనే సేకరించాలి. ఖరీఫ్‌ పంట కోసం సిద్ధమవుతున్న రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర ఇన్‌పుట్స్‌ అందించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో ముందున్న రాష్ట్ర ప్రభుత్వాలకు గణనీయమైన నిధులను విడుదల చేయాలి. మతం ఆధారంగానూ, శాంతియుత నిరసనకారులను, అసమ్మతి వ్యక్తం చేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అరెస్టు చేయడం ఆపాలి. జమ్ముకాశ్మీర్‌లో అరెస్టు చేసిన రాష్ట్రం లోపల, వెలుపల జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి” వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా ఒత్తిడి చేసేందుకు ఏచూరి లేవనెత్తనున్నారు.

Show comments