రీమేకుల వర్షంలో తెలుగు హీరోలు

ఎన్నడూ లేనిది టాలీవుడ్ లో ఈ ఏడాది రీమేకుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. మన దర్శకులు రిస్క్ ఎందుకులే అనుకుంటున్నారో లేక రచయితలు హీరోలకు తగ్గట్టు కథలు రాయడంలో ఫెయిలవుతున్నారో తెలియదు కానీ మొత్తానికి అందరూ రీమేకుల బాట పట్టడం గమనార్హం. అందులోనూ వీటిని పేరున్న దర్శకులే హ్యాండిల్ చేయడం మరో విశేషం. ముందుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తన కంబ్యాక్ కోసం సోషల్ మెసేజ్ ఉన్న పింక్ రీమేక్ ని వకీల్ సాబ్ గా ఎంచుకోవడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. కొంత పార్ట్ మినహా షూటింగ్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది. దీనికి హిందీ వర్షన్ కన్నా తమిళ్ లో కమర్షియల్ ఫ్లేవర్ అద్దిన నీర్కొండ పార్వైని బేస్ గా తీసుకున్నారు.

ఇక వచ్చే నెల విడుదల కానున్న రామ్ రెడ్ తమిళ సూపర్ హిట్ తడంకు రీమేక్. క్రైమ్ థ్రిల్లర్ రూపొందిన ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న నారప్ప ధనుష్ అసురన్ కు తెలుగు రూపమన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లోనే రాబోతున్న మహేశ్వర ఉగ్రరూపస్య మలయాళం నుంచి తీసుకున్న రీమేక్. ఇటీవలే ప్రారంభమైన నితిన్ కొత్త సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ కు అఫీషియల్ రీమేక్. కళ్ళు లేని హీరోగా నితిన్ ఇందులో కొత్తగా కనిపించబోతున్నాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన ఈ థ్రిల్లర్ హిందీలో ఊహించని విజయం సొంతం చేసుకుంది. అందుకే ఏరికోరి మరీ నితిన్ దీన్ని ఎంచుకున్నాడు.

చాలా గ్యాప్ తర్వాత కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగమార్తాండ సైతం రీమేకే. మరాఠీ చిత్రం నట సామ్రాట్ కు ఇది టాలీవుడ్ వెర్షన్. ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇంకొన్ని రీమేకులు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. కన్నడలో గత ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆయుష్మాన్ భవని ఇక్కడ రీమేక్ చేసే ఆలోచనలు జరుగుతున్నాయని తెలిసింది. చంద్రముఖి ఫేమ్ పి.వాసు దీనికి దర్శకుడు. ఇది కాకుండా బాధాయీ హో కూడా ప్రతిపాదన స్టేజిలో ఉంది. చైతుని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. మొత్తానికి ఇలా రీమేకుల వర్షంలో మన హీరోలు తడిసి ముద్దవ్వడం చూస్తుంటే 2020లో వీటి ప్రభావం గట్టిగానే పడేలా ఉంది.

Show comments