ఫ్యాక్షన్ సినిమాకు గ్రామర్ నేర్పిన ‘సమరసింహారెడ్డి’ – Nostalgia

( ఇండస్ట్రీ రికార్డుల్లో కొత్త చరిత్ర సృష్టించిన ఓ మాస్ సినిమా గురించి ఇతర హీరో అభిమాని మాటల్లో )

1999వ సంవత్సరం – జనవరి 18

రాయలసీమ ప్రాంతంలో ఓ చిన్న పట్టణం ……..

అపోజిషన్ హీరో అన్న అక్కసుతో అప్పటికే నాలుగు రోజులు బిగదీసుకుని ఆ సినిమాకు వెళ్ళకుండా మనసు చంపుకున్నాను. పైగా దానికి రెండు వారాల ముందు విడుదలైన మా చిరంజీవి ‘స్నేహం కోసం’ సెంటిమెంట్ తో ఫాన్స్ ని, కలెక్షన్లు తగ్గి థియేటర్ ఓనర్లని ఏడిపిస్తోంది. బులెట్ కాలిన భుజం మీద కారప్పొడి చల్లినట్టు ఎక్కడ చూసినా ప్రత్యర్థిగా భావించే హీరో సినిమా హిట్ టాకే వినిపించడం నన్ను కుదురుగా ఉండనివ్వలేదు . అసలే ఇంటర్ మీడియట్ సబ్జెక్టులు మిగిలి ఖాళీగా ఉన్న టైం. చదువు కాకుండా తెలిసిన ప్రపంచం సినిమా ఒక్కటే. అందుకే ఐదో రోజు ధియేటర్ కు బయలుదేరా

దాని పేరు సమరసింహారెడ్డి. హీరో నందమూరి బాలకృష్ణ.

ఇంత బిల్డప్ ఇచ్చి వెళ్లానని బాలయ్యకు కోపం వచ్చిందో ఏమో టికెట్లు దొరకలేదు. 18 ఏళ్ళ నూనుగు మీసాల వయసులో మనకు పలుకుబడులు ఉండేవి కాదు కాబట్టి కౌంటర్ల మీద ఆధారపడాల్సిందే. మరుసటి రోజు శ్రమ ఫలించి ఏదోలా హాల్ లోకి అడుగు పెట్టా. విపరీతం అనే మాటకు అర్థం తెలిసివచ్చింది. సీట్ నెంబర్లు ఉండేవి కాదు కాబట్టి ఎక్కడికక్కడ ఎవడి స్థాయిలో వాడు స్నేహితుల కోసం అభిమానుల కోసం కుర్చీలను అడ్డంగా బ్లాక్ చేసుకుని కూర్చున్నారు. ఆవేళ లేచిన వేళావిశేషం బాగుండబట్టి కూర్చుని చూసే అదృష్టాన్ని దక్కించుకున్నా.

టైటిల్స్ మొదలయ్యే టైంకి ఆ థియేటర్ సీటింగ్ కెపాసిటీలో సగం జనం కింద నేల మీద కూర్చున్నారు. మధ్యలో లేచి బయటికి వెళ్ళాలన్నా అంత ఈజీగా జరిగే పనిలా కనిపించడం లేదు. ఎందుకింత ఎగబడి వస్తున్నారో సరే తేల్చుకుందామని చూడటం మొదలుపెట్టా. అబ్బులుగా బాలయ్య ఎంట్రీ. ఈలలు గోలలు కామన్. పాటలు వినిపించడం లేదు. హోరెత్తిపోతోంది హాల్. ఏమాటకామాటే. మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్ కి మాస్ జనం గూస్ బంప్స్ తో ఊగిపోతున్నారు. ఇదంతా సరేలే ఇంతకన్నా బాబులాంటి సందడి చిరు సినిమాల్లో చూసిందే కదాని సర్దుకుని కంటిన్యూ చేశా

ఎప్పుడో డ్రైవర్ రాముడులో చూసిన హోటల్ కామెడీ, బాషాలో ఎంజాయ్ చేసిన అండర్ డాగ్ ఫార్ములా, కొత్తేమి అనిపించని సిస్టర్ సెంటిమెంట్ ఇవన్ని బాగానే ఉన్నాయి కాని ఏముందని దీనికి బ్రహ్మరధం పడుతున్నారో అర్థం కాని అయోమయంలో చూస్తూనే ఉన్నా. సినిమా ముందుకు వెళ్ళే కొద్ది అల్లరి అంతకంతా పెరుగుతూ పోతోంది. ఇంటర్వెల్ బ్లాక్ లో హీరొయిన్ అంజలా ఝవేరి సమరసింహరెడ్డి పేరుని ఉచ్చరించగానే వినిపించిన కేకలకు చెవుడు వస్తుందేమో అన్నంత భయం వేసింది

చాలాసేపటికి అసలైన ఘట్టం వచ్చింది. రాయలసీమ ఫ్లాష్ బ్యాక్. రైల్వే స్టేషన్ లో బాలయ్య బోగిలో నుంచి దిగి వస్తున్న సీన్ కి ఫ్యాన్స్ హారతులు పట్టడం ఒక్కటే తక్కువ. వీరరాఘవరెడ్డి కూతలకు బదులుగా సవాల్ చేసే సమరసింహారెడ్డి పలుకుతున్న పరుచూరి మాటలకు, మీసం తిప్పుతూ బాలయ్య నడిచి వస్తుంటే స్పీకర్ లో అదిరిపోతున్న బీజీఎమ్ కు, పాత్రలు చెబుతున్న డైలాగులు ఒక్కటి అర్థమైతే ఒట్టు. గుంపులుగా పంచెలు కట్టుకున్న సమూహాలను సినిమా హాల్ లో చూడటం కూడా అదే మొదటిసారి. ఏదో పూనకం వచ్చినట్టు అంతా ఊగిపోతున్నారు

తన కుటుంబాన్ని చంపినందుకు ప్రతీకారంగా శత్రువు ఇంటికే వచ్చి వీరరాఘవ రెడ్డి కొడుకు తలను నరికినప్పుడు, నీ ఇంటికొచ్చా నట్టింటికి వచ్చా అంటూ సమరసింహారెడ్డి రౌద్రం నిండిన కళ్ళతో సంభాషణలు చెబుతుంటే ఏదో సీటు కింద బాంబు పెట్టినట్టు నా ముందు వరసలో కూర్చున్న ఓ వ్యక్తి ఎగిరెగిరి పడుతూ ఉద్వేగంతో కేకలు పెడుతుంటే మాస్ ఎమోషన్ కు అర్థం ఆ గోల సాక్షిగా అర్థమైంది. సినిమా మొత్తం ఎలా ఉన్నా అరగంట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కే టికెట్ డబ్బులు గిట్టుబాటయ్యాయన్న ఆనందంతో, కళ్ళలో మెరుపులతో బాలయ్య అభిమానులు బయటికి వస్తుంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదొక ప్రభంజనం. బాలయ్య మాస్ స్టామినా బాక్స్ ఆఫీస్ కు మరోసారి చూపించిన చిత్రం. ఎన్నో థియేటర్లు దీనికి వచ్చిన కలెక్షన్లతోనే రీ మోడలింగ్ చేసుకోవడం, ఏసీలు బిగించుకోవడం ప్రత్యక్షంగా చూసాను. పార్కింగ్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకున్న వాళ్ళు, లోపల క్యాంటీన్లు నడిపే వాళ్ళు అందరికీ కాసుల వర్షమే. తర్వాత జిల్లా కేంద్రానికి వెళ్ళినప్పుడు 40వ రోజు అనుకుంటా ఇంకోసారి ఫస్ట్ షో చూద్దామని వెంకటేష్ థియేటర్ కు వెళ్ళా. నేను ఐదో రోజు చూసిన రద్దీ కంటే మూడింతలు ఎక్కువ తాకిడి నన్ను వెక్కిరించింది

ఫినిషింగ్ టచ్

ఇది గొప్ప చిత్రమని కళాఖండమని చెప్పడం నా ఉద్దేశం కాదు. బాలయ్య ఇంతకన్నా అద్భుతమైన పాత్రలు ఆదిత్య 369, ముద్దుల మావయ్య, భైరవ ద్వీపం, మంగమ్మ గారి మనవడు, పెద్దన్నయ్య లాంటివి ఎన్నో చేశారు. ఒకరకంగా చెప్పాలంటే బాలయ్య కెరీర్ ని ఉచ్ఛ స్థితికి తీసుకెళ్లడంలో సమరసింహారెడ్డి ఎంత చురుగ్గా పనిచేసిందో అంతే వేగంగా ఆయన్ని అర్థంలేని మూసలో ఇరికించేందుకు దర్శకులు వృధా ప్రయాస పడేలానూ చేసింది. అందుకే ఇప్పుడీ ట్రాలింగులు కామెడీలు. ఏది ఎలా ఉన్నా ఫ్యాక్షన్ సినిమాలతో కాసులు ఎలా కురిపించుకొవచ్చో ప్రత్యక్షంగా నిరూపించి చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రాజశేఖర్ ఇలా ఎందరో హీరోలు అదే బాట పట్టేలా చేసి ఒక బెంచ్ మార్క్ లా నిలిచిపోయిన సమరసింహారెడ్డి కమర్షియల్ కథలకు ఒక గ్రామర్ బుక్ అని చెప్పొచ్చు.

Show comments