iDreamPost
android-app
ios-app

ఎనిమిది రాష్ట్రాలలో ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికలు

ఎనిమిది రాష్ట్రాలలో ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికలు

దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 19 రాజ్యసభ స్థానాలకు కొద్దిసేపటి క్రితం ఎన్నికలు ప్రారంభమయ్యాయి.గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బిజెపి,కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నడుస్తుండటంతో సాయంత్రం వెలువడే ఫలితాల పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది.

గత మార్చిలో రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు కరోనా మహమ్మారి కారణంగా ఓటింగ్ వాయిదా పడ్డాయి. తరువాత ఎన్నికల సంఘం కర్ణాటకలో నాలుగు స్థానాలకు,మిజోరం,అరుణాచల్ ప్రదేశ్‌లలో ఒక స్థానం చొప్పున భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.ఇక నేడు పోలింగ్ జరుగుతున్న 19 సీట్లలో ఆంధ్రప్రదేశ్,గుజరాత్‌లలో నాలుగు చొప్పున ఉండగా, మధ్యప్రదేశ్,రాజస్థాన్ నుండి మూడు సీట్లు చొప్పున జార్ఖండ్ నుండి రెండు, మణిపూర్, మిజోరాం, మేఘాలయ నుండి ఒక్కొక్క సీటు ఉన్నాయి.

ఉత్కంఠతకు తెర దింపాలంటే వివిధ రాష్ట్రాలలో అధికార,ప్రతిపక్ష పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి లెక్కలు సరి చూస్తే సరిపోతుంది.

గుజరాత్‌లో కీలకంగా మారిన మూడు ఓట్లు:

గుజరాత్‌లో నాలుగు స్థానాలకు అధికార బిజెపి ముగ్గురు అభ్యర్థులను పోటీకి నిలపగా,ప్రతిపక్ష కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దిగింది.

182 మంది సభ్యుల అసెంబ్లీలో 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.ప్రస్తుత పార్టీల సంఖ్యా బలాలను పరిశీలిస్తే అధికార బిజెపి రెండు స్థానాలు,కాంగ్రెస్ ఒక స్థానాన్ని సునాయాసంగా దక్కించుకుంటాయి.ఇరు పార్టీలు తమ సొంత బలముతో అదనపు సీటు గెలిచే అవకాశం లేదు.రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ‘ఆపరేషన్ కమలం’తో ఎనిమిది మంది తమ ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ బలం 65 కు పడిపోయింది. కాగా నేటి ఎన్నికలలో తమ అభ్యర్థులకు సొంత ఎమ్మెల్యేలతోపాటు ఒక స్వతంత్ర (జిగ్నేష్ మేవానీ) మద్దతు ఇస్తుండటంతో రెండు స్థానాలను గెలవడానికి కాంగ్రెస్‌కు ఇంకా నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.ఇక బిజెపి పరిస్థితి కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు.బిజెపి ఎమ్మెల్యేల సంఖ్య 103 కాగా, మూడు సీట్లు గెలవడానికి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఈ పరిస్థితిలో నాల్గవ సీటు ఫలితాన్ని ఇద్దరు భారతీయ గిరిజన పార్టీ (బిటిపి) ఎమ్మెల్యేలు,ఒక ఎన్‌సిపి ఎమ్మెల్యే నిర్ణయిస్తారు.

బిజెపి తరుపున ముగ్గురు అభ్యర్థులు అభయ్ భరద్వాజ్, రమీలా బారా, నార్హారీ అమీన్‌లు కాంగ్రెస్ తరుపున ఇద్దరు నామినీలు శక్తిసింహ్ గోహిల్ మరియు భరత్సింగ్ సోలంకి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాజస్థాన్‌లో పారని కమలం పాచిక:

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి ఇద్దరూ తమ శాసనసభ్యులను ప్రత్యర్థులు ప్రలోభ పెడుతున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని క్యాంపు రాజకీయాలకు తెర తీశాయి. పైగా బిజెపి విసిరిన గాలానికి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ చిక్కక పోవడంతో బిజెపి ఆశలు అడియాశలు అయ్యాయి

మూడు ఖాళీ సీట్ల కోసం కోసం నలుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.కాంగ్రెస్ అభ్యర్థులుగా కె సి వేణుగోపాల్, నీరజ్ డాంగి లు నామినేట్ చెయ్యబడ్డగా,ప్రతిపక్ష బిజెపి తమ అభ్యర్థులుగా రాజేంద్ర గెహ్లోట్, ఓంకర్ సింగ్ లఖవత్ లను నిలబెట్టింది.

200 మంది శాసనసభ సభ్యులలో కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు, రాష్ట్రీయ లోక్‌దళ్, సిపిఐ (ఎం),భారతీయ గిరిజన పార్టీ (బిటిపి) వంటి ఇతర పార్టీల శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది.

అధికార పార్టీకి రెండు సీట్లు గెలవడానికి కావలసిన దానికన్నా ఎక్కువ మెజారిటీ ఉంది.ప్రతిపక్ష బిజెపికి 72 మంది సొంత ఎమ్మెల్యేల బలం,ముగ్గురు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. అయితే ఈ సంఖ్య బలంతో ఒక స్థానాన్ని బిజెపి ఎటువంటి ఆందోళన లేకుండా హాయిగా దక్కించుకోవచ్చు.

మధ్యప్రదేశ్‌లో అదనపు సీటు బిజెపి సొంతమేనా ?

మధ్యప్రదేశ్‌లోని మూడు స్థానాలకు బిజెపి,కాంగ్రెస్ చెరో ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టాయి. బిజెపి అభ్యర్థులు కాంగ్రెస్ మాజీ ఎంపి జ్యోతిరాదిత్య సింధియా, సుమేర్ సింగ్ సోలంకి కాగా, కాంగ్రెస్ దిగ్విజయ సింగ్, దళిత నాయకుడు ఫూల్ సింగ్ బరియా లను పోటీకి దింపింది.

230 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం 24 సీట్లు ఖాళీగా ఉన్నందున,సభలో ఎమ్మెల్యేల సంఖ్య 206.ప్రస్తుతం బిజెపికి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా,బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఇద్దరు,సమాజ్ వాది పార్టీ ఒక ఎమ్మెల్యే మరియు ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారు.ఇక జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 22 మంది శాసనసభ్యుల తిరుగుబాటుతో ప్రతిపక్ష కాంగ్రెస్ బలం 92 కి తగ్గింది.

మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలను స్థానాలలో ఒక్కో అభ్యర్థి గెలుపుకి 52 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం.అయితే బిజెపి రెండు సీట్లు,కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంటామని భావిస్తున్నప్పటికీ మిగిలిన స్థానం కోసం రెండు పార్టీలు పోరాడుతున్నాయి.

మణిపూర్‌లో కాంగ్రెస్‌కే అవకాశం:

రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు మణిపూర్‌లో పాలక బిజెపి సంకీర్ణానికి డిప్యూటీ సీఎం జైకుమార్ సింగ్ తో సహా తొమ్మిది మంది సభ్యులు మద్దతు ఉపసంహరించారు. ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.తాజా పరిణామాలను గమనిస్తే బిజెపి అభ్యర్థి లీసెంబా సనాజోబాపై కాంగ్రెస్ నామినీ టి మంగి బాబు విజయం తథ్యం అని చెప్పవచ్చు.

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం:

కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, బిజెపి అభ్యర్థులు ఈరణ్ణ కడాడి,ఆశోక్ గస్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అరుణాచల్ ప్రదేశ్ నుండి ఏకైక రాజ్యసభ స్థానానికి బిజెపి అభ్యర్థి నాబమ్ రెబియా కూడా ఎన్నిక లేకుండా ఎంపికయ్యారు.

ఇక మిజోరాం,మేఘాలయలోని ఒక్కొక్క స్థానాలు పాలక బిజెపి సంకీర్ణం సొంతం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఎగువ సభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే టిడిపి అభ్యర్థి వర్ల రామయ్య నామమాత్రం పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అధికార వైయస్సార్సీపి బలపర్చిన నలుగురు అభ్యర్థుల గెలుపు లాంఛనమే.