ప్రకాశం జిల్లా: ఓ సక్సెస్ ఫుల్ స్టోరీ

కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో అనేక చోట్ల భిన్నమైన అనుభవాలున్నాయి. ఒక్కో దేశం, ఒక్కో రాష్ట్రం ఈ మహమ్మారిపై పోరాటంలో ఒక్కో రకమైన అనుభవాలతో ముందుకు సాగుతున్నాయి. అనేక దేశాలు విజయాలు సాధించాయి. వియత్నాం వంటి చిన్న దేశాల విజయం విశ్వమంతా స్ఫూర్తినిస్తుంటే మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, గోవా వంటి వాటితో పాటుగా కేరళ అనుభవం అందరికీ ఆదర్శనీయంగా కనిపిస్తోంది. ఇక ఏపీలోని ప్రకాశం జిల్లాలో కూడా వైరస్ వ్యాప్తి నియంత్రణలోనూ, రోగులకు తగిన చికిత్స అందించడంలోనూ విశేషమైన ఘనతను సాధించింది.

ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదు కాగా, మార్చి 13న రెండో కేసు ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. దాంతో ఒక్కసారిగా జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. పక్క పక్క జిల్లాల్లోనే కేసులు రావడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కాంటాక్టుల వివరాలను సేకరించడానికి ప్రాధాన్యతనిచ్చింది. అయితే మార్చి చివరి నాటికి మర్కజ్ కేసుల రాకతో ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఏప్రిల్ మొదటి వారం నాటికే 50 కేసులు దాటిపోయాయి. దాంతో కేసులు సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా కనిపించింది. కానీ ప్రభుత్వం మాత్రం సకాలంలో స్పందించడం ద్వారా దానిని పరిమితం చేయగలిగింది.

గురువారం సాయంత్రానికి ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం కేసులు 63 కాగా అందులో 62 మంది డిశ్చార్జ్ అయిపోయారు. ఇప్పటి వరకూ ఒక్క మరణం కూడా నమోదు కాకుండా కేవలం ఒకే ఒక్క యాక్టివ్ కేసు ప్రస్తుతం జిల్లాలో ఉందంటే యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేసిందో అర్థమవుతుంది. ఒంగోలులోని కొన్ని ప్రాంతాలు , చీరాల వంటి పట్టణాల్లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నప్పుడు తొలుత ఉలిక్కిపడిన జిల్లాలో ఇప్పుడు ఉపశమనం కనిపిస్తోంది. కందుకూరు సహా పలు గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించినప్పటికీ విస్తృతి పెరగకుండా నియంత్రణలో యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. మంచి ఫలితాన్ని సాధించింది. ప్రజలకు ఊరటనిచ్చింది.

అంతేగాకుండా క్వారంటైన్ కేంద్రాల నిర్వహణలోనూ, ఇతర వ్యవహారాల్లో కూడా ప్రకాశం జిల్లా అనుభవం అందరికీ స్ఫూర్తివంతంగా ఉంటుందని రాష్ట్ర స్థాయి అధికారులు సైతం భావిస్తున్నారు. ఏమైనా కరోనా కట్టడిలో మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అనుభవం కూడా ప్రత్యేక పాఠంగా భావించవచ్చు. జిల్లా మీదుగా నిత్యం వేల సంఖ్యలో వలస కూలీలు సాగుతున్నా, జిల్లాలోని చీమకుర్తి సహా పలు ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వైరస్ నియంత్రణలో తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాన్నిచ్చినట్టుగా చెప్పవచ్చు.

Show comments