iDreamPost
iDreamPost
సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ కి కరోనా బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ దీని తర్వాత ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్న అశ్విన్ డిసెంబర్ లో మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరిలోపు విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ స్టొరీ టైం ట్రావెల్ ని బేస్ చేసుకుని సాగుతుందట.
అంటే కాలంతో చేసే ప్రయాణం అన్న మాట. అయితే ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఈ ప్రయోగం చేసింది బాలకృష్ణ ఒక్కరే. సౌత్ లో చూసుకుంటే సూర్య కూడా వస్తాడు. 1991లో సింగీతం శ్రీనివాసరావు గారి రూపొందించిన ఆదిత్య 369 ఇప్పటికీ క్లాసిక్ గా చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ఎవరూ టచ్ చేయనిస్ సైన్సు ఫిక్షన్ ని ఆయన మలచిన తీరు అద్భుత ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా టైం మెషీన్ అనే పాయింట్ సూపర్ గా కనెక్ట్ అయ్యింది. ఇళయరాజా సంగీతం, భారీ నిర్మాణం మర్చిపోలేని చిత్రంగా నిలబెట్టాయి. ఆ తర్వాత చాలా కాలానికి ఆ మధ్య విక్రం కుమార్ డైరెక్షన్ లో సూర్య 24 చేశారు. ఓ వాచ్ ని పట్టుకుని వెనక్కు ముందుకు వెళ్ళే కాన్సెప్ట్ తో సూర్య చేసిన ట్రిపుల్ రోల్ బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడు ప్రభాస్ లో మరి దేన్ని వాడి కాలంతో పరుగులు పెడతాడో ఇంకా తెలియదు. నాగ అశ్విన్ టాలెంట్ ని అంత ఈజీగా అంచనా వేయలేం. మహానటిని డీల్ చేసిన విధానానికి ఏకంగా కమర్షియల్ సినిమా స్థాయిలో వసూళ్లు దక్కాయి. ప్రభాస్ మూవీని భారీ బడ్జెట్ తో తీయబోతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. దానికి తోడు ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని ఆ మధ్య అశ్విన్ చెప్పడం అప్పుడే అంచనాలు పెంచేసింది. ఒకవేళ కరోనా షూటింగులు ఇంకా ఆలస్యమైతే మటుకు ఇది ప్రారంభమవ్వడానికి టైం పట్టొచ్చు. హీరొయిన్, సంగీత దర్శకుడు తదితర వివరాలేవీ ఇంకా బయటికి రాలేదు. ఎలాగూ టైం ఉంది కాబట్టి తెలుసుకునే ఛాన్స్ అయితే లేదు. బాహుబలి ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కాని ప్రభాస్ ప్రతి సినిమాకు భారీ ఎదురు చూపులు తప్పేలా లేవు.