పోకిరి వెనుక మెగా సీక్రెట్ – Nostalgia

టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ లో పోకిరిది ప్రత్యేక స్థానం. మహేష్ బాబు, ఇలియానా జంటగా మణిశర్మ సూపర్ హిట్ సాంగ్స్ తో దర్శకుడు పూరి జగన్నాధ్ చేసిన ఈ మూవీ ప్రిన్స్ ఫాన్స్ నే కాదు తెలుగు సినిమాను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికి నచ్చి మెచ్చిన సినిమాగా రికార్డులకెక్కి సూపర్ స్టార్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా మిగిలిపోయింది. ‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు’ అనే డైలాగ్ కొన్నేళ్ళ పాటు యూత్ నోటి వెంట తారక మంత్రంలా ఉండిపోయింది అంటే దాని ప్రభావం ఎంతనో చెప్పనక్కర్లేదు.

పోకిరి సినిమాలో నిజానికి బాగా ఆకట్టుకున్న అంశం హీరో అండర్ కవర్ పోలీస్ గా ఉంటూ చూసేవాళ్ళకు అనుమానం రాకుండా ప్రీ క్లైమాక్స్ కి ముందు ట్విస్టు రివీల్ చేయటం. ఏ మాత్రం ఊహకు అందకుండా పర్ఫెక్ట్ టెంపో మైంటైన్ చేస్తూ చివరిలో థ్రిల్ ఇవ్వడం పోకిరిని మళ్ళి మళ్ళి చూసేలా చేసింది. నిజానికి పోకిరికి ఏదో హాలీవుడ్ మూవీ స్ఫూర్తి అనుకుంటారు మూలం మన తెలుగులోనే ఉంది. ఏంటి డౌటా. మీరే చూడండి.

1988లో చిరంజీవి హీరోగా టి.సుబ్బరామిరెడ్డి నిర్మాణంలో బి. గోపాల్ దర్శకత్వంలో స్టేట్ రౌడీ వచ్చింది. బప్పి లహరి సంగీతం తెలుగు రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తే, చిరు డాన్స్, నటనకు స్టేట్ మొత్తం ఫిదా అయ్యింది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాదించిన ఈ మూవీలో రాధ, భానుప్రియ హీరొయిన్స్. రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, త్యాగరాజన్ విలన్స్.

ముందు కథ చూద్దాం

కాళిచరణ్ అనే రౌడీ ఊళ్ళో ఉన్న మిగిలిన గూండా బ్యాచులను భయపెడుతూ అందరిని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. ఇతను తమకు పనికొస్తాడని గుర్తించిన పరస్పరం శత్రువులైన ఇద్దరు మాఫియా డాన్లు రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని కీలకమైన సంఘటనలు జరిగిన తర్వాత కాళిచరణ్ అసలు పేరు పృథ్వి అని, అతను ఎస్పి శారద సీక్రెట్ గా ఆప్పాయింట్ చేసిన అండర్ కవర్ పోలీస్ అని తెలుస్తుంది. శారద భర్త కాలేజీ ప్రొఫెసర్ అయిన జగ్గయ్య హత్య కేసుకు ఇదంతా లింక్ అయ్యి ఉంటుంది. మరి పృథ్వి వీళ్ళందరి ఆట ఎలా కట్టిస్తాడు అనేది మిగిలిన స్టొరీ

పోకిరి స్టొరీ తెల్సిందే కాబట్టి రెండింటికి కనెక్షన్ ఏంటో చూద్దాం

కాళిచరణ్/పృథ్వి(చిరంజీవి)-పండు/కృష్ణ మనోహర్(మహేష్ బాబు)

రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్- ప్రకాష్ రాజ్

షియాజీ షిండే- శారద

రాధ- ఇలియానా

నర్రా వెంకటేశ్వర్ రావు- ఆశిష్ విద్యార్ధి

కీలక పాత్రలను చూసుకుంటే స్టేట్ రౌడీకి, పోకిరికి చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో, అతన్ని అండర్ కవర్ లో ఉండి మాఫియా గుట్టు తెలుసుకోమని ప్రేరేపించిన శారద, డిపార్టుమెంటులోనే ఉంటూ విలన్లకు సహకరించే నర్రా పాత్రలు రెండు సినిమాల్లోనూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అంటే మూల కథగా చూసుకుంటే రెండూ ఒకటే. కాని స్టేట్ రౌడీ ట్రీట్మెంట్ అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మెలోడ్రామాతో పండించినట్టు కనిపిస్తే పోకిరిని స్టైలిష్ మోడ్ లో చాలా మార్పులు చేసి తీసారు.

కాళిచరణ్ ఎంత రఫ్ గా కనిపిస్తాడో పండుగాడు కూడా అలాగే ఉంటాడు. పోకిరి లో ప్రీ క్లైమాక్స్ వరకు అసలు మలుపుకు సంబంధించి ఎలాంటి అనుమానం రాదు. కాని స్టేట్ రౌడీ లో సెకండ్ హాఫ్ లోపే అది రివీల్ కావడంతో జగ్గయ్య మర్డర్ కేసు చుట్టే కథ టర్న్ తీసుకుంటుంది. భానుప్రియ పాత్రకు శారద భర్త హత్య కేసుకు లింక్ పెట్టడం అక్కడ ట్విస్ట్ అయితే షియాజీ షిండే కూతురిని విలన్ గ్యాంగ్ రేప్ చేయటం పోకిరిలో ఉంటుంది. మార్పులైతే చాలా కనిపిస్తాయి కాని లోతుగా చూస్తే మాత్రం మెయిన్ లైన్ ఒకటే అనడంలో సందేహం లేదు

మ్యూజిక్ మాత్రం రెండు సినిమాల్లో అద్భుతంగా ఉంటుంది. స్టేట్ రౌడీ పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిస్తే మణిశర్మ పోకిరి పాటలను ఇష్టపడని వారు లేరు. అప్పట్లో ఇవి రాష్ట్రం మొత్తం మారుమ్రోగిపోయాయి. స్టేట్ రౌడీ సినిమాకు నేపధ్య సంగీతం మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ శ్యాం అందించారు. అంతిమ తీర్పుతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి పేరు తెచ్చుకున్న ఈయనను ప్రత్యేకంగా తీసుకున్నారు. పోకిరిలో మహేష్ మాస్ లుక్ లో ఉంటే స్టేట్ రౌడీలో కూడా చిరు అలాగే ఉంటాడు.

స్టేట్ రౌడీకి జరుగుతున్న బిజినెస్ చూసి అమితాబ్ బచ్చన్ లాంటి ఆల్ ఇండియా స్టార్ సైతం చిరు గురించి ఎంక్వయిరీ చేస్తే పోకిరి సినిమా సృష్టించిన రికార్డులు చూసి సల్మాన్ ఖాన్ అంతటి వాడు అది రీమేక్ చేసుకునే దాకా వదల్లేదు.

పోకిరిని చాలా జాగ్రత్తగా డీ కోడింగ్ చేస్తే బయట పడిన ఒరిజినల్ స్టేట్ రౌడీ

మీరే రెండు సినిమాలు మరోసారి చూడండి. క్లారిటీ వచ్చేస్తుంది.

Show comments