iDreamPost
iDreamPost
పారాసెట్ మాల్..ఈ పాయింట్ చుట్టూ ఏపీలో సాగించిన రాజకీయ బురదజల్లే వ్యవహారం అంతా ఇంతా కాదు. కరోనా బాధితులకు ప్రస్తుతానికి ఎటువంటి మందులు లేని సమయంలో జ్వరం రాకుండా నియంత్రించే పారాసెట్ మాల్ మందుల గురించి ఏపీ సీఎం ప్రస్తావించగానే పెద్ద రచ్చ సాగింది.
ఆ సందర్భంలో ఓ వర్గం మీడియా బురదజల్లడానికి ఇచ్చిన ప్రాధాన్యత వాస్తవాలు తెలుసుకోవడానికి ఇవ్వలేదని ఇప్పుడు అర్థమ వుతోంది. కేవలం జగన్ చెప్పినందున దాని చుట్టూ జగడం రాజేయడమే తప్ప దాని వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదని స్పష్టమవుతోంది.
ప్రపంచమంతా పారాసెట్ మాల్
కరోనా నియంత్రణకు ఉన్న మందుల విషయంలో హైడ్రోక్లోరోక్విన్ , పారాసెట్ మాల్ మినహా మరో దారి కనిపించడం లేదు. మలేరియా రోగులకు వినియోగించే హైడ్రోక్లోరోక్విన్ కోసం ఇప్పటికే అమెరికా మన ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం, వెంటనే వాటి ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో తమదేశంలో పారాసెట్మాల్ అందుబాటులో ఉండడంతో హైడ్రోక్లోరోక్విన్ కోసం యూఎస్ తాపత్రయ పడినట్టు కనిపించింది. ఒక్క అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఇప్పుడు ఆ మందుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మన దేశం నుంచి పారాసెట్మాల్ కూడా పలు దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా బ్రిటన్ కి వాటిని అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం తమకు పారాసెట్మాల్ అందించిన భారత ప్రభుత్వానికి బ్రిటన్ హైకమిషనర్ కృతజ్ఞతలు చెప్పారు. ఉమ్మడిగా కరోనా ని ఎదుర్కోవడంలో ఇదో ముందడుగు అని హైకమిషనర్ జాన్ థాంప్సన్ పేర్కొన్నారు. తమకు పారాసెట్మాల్ పంపించేందుకు అంగీకరించిన ప్రదాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అంటే పారాసెట్మాల్ కోసం వివిధ దేశాలు ఎంతగా ఎదురుచూస్తున్నాయనే విషయం స్పష్ట అవుతోంది.
స్పెయిన్ లో సైనికులే పారాసెట్మాల్
విపత్తు ముంచుకొస్తున్న వేళ స్పెయిన్ లో సైనికులు కూడా తమ కార్యకలాపాలన్నీ నిలిపివేసి మందుల తయారీలో మునిగిపోయారు. అందులో భాగంగా శానిటైజర్లతో పాటుగా పారాసెట్మాల్ మందులు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్పెయిన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. తమ సైనికులు పారాసెట్మాల్ మందు బిళ్లలు సిద్ధం చేస్తున్న వీడియోలు కూడా విడుదల చేసింది కేవలం యూరప్ దేశాలే గాకుండా చైనా నుంచి వివిధ దేశాలకు అందిస్తున్న కోవిడ్ 19 సహాయక సామాగ్రిలో పీపీఈలు, వెంటిలేటర్లతో పాటుగా పారాసెట్మాల్ కూడా ఉందంటే దాని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.
క్వారంటైన్ లో ఉన్న వారికి కూడా పారాసెట్మాల్..!
విదేశాల్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణలో పారాసెట్మాల్ ప్రధాన మెడిసిన్ గా ఉంది. బాధితులకు పారాసెట్మాల్ అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకూ అనేక మంది కోలుకుంటున్న వారికి పారాసెట్మాల్ తోడ్పడిందని కూడా వెల్లడించారు. అంటే ఆ మందు ప్రాధాన్యత అర్థం అవుతుంది.
ఈ విషయాన్ని గ్రహించకుండా కొందరు, రాజకీయంగా ఏపీ సీఎంని బద్నా చేయాలనే లక్ష్యంతో మరికొందరు పారాసెట్మాల్ చుట్టూ పెద్ద ప్రచారమే నిర్వహించారు. సోషల్ మీడియాలో దాని చుట్టూ పోస్టుల పరంపర నడిపారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ప్రపంచమంతా ఇప్పుడు పారాసెట్మాల్ ప్రాధాన్యత గుర్తిస్తున్న నేపథ్యంలో తొలినాళ్లలో సీఎం చెప్పిన మాటల సారాంశం గుర్తించడంలోనే తేడా ఉందనే విషయం అందరికీ అర్థమవుతోంది.