iDreamPost
android-app
ios-app

ఓటిటి – పెరుగుటకా విరుగుటకా ?

  • Published Mar 05, 2020 | 9:59 AM Updated Updated Mar 05, 2020 | 9:59 AM
ఓటిటి –  పెరుగుటకా  విరుగుటకా ?

ఇప్పుడు టాలీవుడ్ ని డిజిటల్ స్ట్రీమింగ్ విప్లవం ఊపేస్తోంది. ఏ ఇద్దరు నిర్మాతలు కలిసినా తమ రాబోయే సినిమాల హక్కులను ఎవరికి ఎంత రేట్ కు అమ్మారనే చర్చను ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. దానికి తోడు ఇటీవలే ఆహాతో అల్లు కాంపౌండ్ రంగంలోకి దిగడంతో పోటీ మరింత రంజుగా మారింది. ఇది చాలదన్నట్టు దిల్ రాజు-సురేష్ బాబు సంయుక్తంగా కొత్త యాప్ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న మీడియా కథనాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నిజంగా ఇందరు పోటీ పడేంత స్కోప్ ఇందులో ఉందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

మార్కెట్ లో ఇప్పుడు లీడర్లు ఉన్నది ఇద్దరే. ఒకటి అమెజాన్. రెండు నెట్ ఫ్లిక్స్. హాట్ స్టార్, జీ 5, సన్ నెక్స్ట్ లాంటివి పోటీ ఇస్తున్నాయి కానీ వాటికి ధీటుగా నిలవలేకపోతున్న మాట వాస్తవం. కారణం టాప్ టూలో ఉన్న ఆ ఇద్దరు ప్లేయర్స్ ఇంటర్ నేషనల్ కంటెంట్ ఇస్తుండగా మిగిలినవాటికి ప్రస్తుతానికి అంత సీన్ లేకపోవడం. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు బడ్జెట్ లో కాంప్రమైజ్ కాకుండా తమ ఒరిజినల్ కంటెంట్ కోసం అవసరమైతే ఓ భారీ బడ్జెట్ సినిమా కన్నా ఎక్కువ ఖర్చు పెడతాయి. బాష ఏదైనా క్రేజీ సినిమా ఉందంటే రైట్స్ కోసం గిరిగీసుకుని లెక్కలు వేసుకోవు.

మంచి కాన్సెప్ట్ దొరికిందంటే కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ లోకల్ యాప్స్ కి అంత సీన్ ఉండదు. హాట్ స్టార్ కొంతలో కొంత నయం. క్వాలిటీ విషయంలో గట్టి పోటీకి రెడీ అవుతోంది. మిగిలినవి ఎక్కువగా సినిమాల మీద ఆధారపడుతున్నాయి. కానీ ఆదాయం తీసుకురావడానికి అవొక్కటే సరిపోవు. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తో కొత్త సిరీస్ లు తీయాలి. రాజీపడకుండా నటీనటులను ఒప్పించాలి. థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం కన్నా ఇంట్లో కూర్చుకుని వెబ్ సిరీస్ ఎంజాయ్ చేద్దామనే స్థాయిలో అవుట్ ఫుట్ ఉండాలి.

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఈ విషయంలో చాలా ముందంజలో ఉన్నాయి. మరి ఆహాతో పాటు రాబోయే సంస్థలు, ఇప్పటికే పోటీలో ఉన్న కంపెనీలు ఆ దిశగా అలోచించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కానీ డిమాండ్ ఉంది కదాని ఒక్కొక్కరు మొదలుపెట్టుకుంటూ పోతే చివరికి వ్యవహారం గందరగోళం అవుతుంది. అసలే ఇన్నేసి యాప్స్ కి చందాల రూపంలో డబ్బులు ఎలా కట్టాలా అని ఎంటర్ టైన్మెంట్ లవర్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సంఖ్య పెరిగితే బెస్ట్ కంటెంట్ ఇచ్చినవాడికి తప్ప మిగిలినవాళ్లకు వచ్చేది చిల్లర పైసలే. అందుకే పెట్టుబడి-లాభం లెక్కలు వేసుకోకుండా ముందు బడ్జెట్ లు కుమ్మరించుకుంటూ పోతే ఆ తర్వాత మార్కెట్ లో బలంగా నిలబడవచ్చు. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా అంతా మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది