iDreamPost
android-app
ios-app

నటశిఖరాల మధ్య డైలాగ్ కింగ్ – Nostalgia

  • Published Apr 06, 2020 | 7:40 AM Updated Updated Apr 06, 2020 | 7:40 AM
నటశిఖరాల మధ్య డైలాగ్ కింగ్ – Nostalgia

దక్షణాది సినీ చరిత్రలో తమకంటూ సువర్ణాధ్యాయాలు లిఖించుకున్న హీరోలు ఇద్దరు. స్వర్గీయ నందమూరి తారకరామారావు, దివంగత శివాజీ గణేషన్. నటనలో వీరు చేయని పాత్ర లేదు చేరని ఎత్తులు లేవు. అశేష అభిమానుల అండతో ఎన్నో గొప్ప సినిమాలకు ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ దిగ్గజాలు కలుసుకున్న సందర్భం ఏదైనా అపురూపమే. శివాజీగణేషన్ గారు చాలా తక్కువగా తెలుగులో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో చేసిన చాణక్య చంద్రగుప్త ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు.

నాగార్జున అగ్ని పుత్రుడు, కృష్ణ విశ్వనాధ నాయకుడు, బెజవాడ బెబ్బులి లాంటి స్ట్రెయిట్ మూవీస్ అన్నింటిలోనూ శివాజీ గణేషన్ చేసిన రోల్స్ చాలా పేరు తీసుకొచ్చాయి. అయితే వీటి కన్నా ఎక్కువగా వీరపాండ్య కట్టబొమ్మన, క్షత్రియ పుత్రుడు లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారానే ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సీనియర్ నటుడు ప్రభు వీరి వారసుడే. ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు. అంతగొప్ప ప్రస్థానం ఇప్పటిదాకా ఏ నటుడు చవిచూడలేదనడం అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరు కలుసుకున్న ఓ అరుదైన సందర్భానికి మోహన్ బాబు సాక్షి కావడం ఇక్కడి ఫోటోలోని ప్రత్యేకత.

ఓ సినిమాకు సంబంధించిన వేడుకలో ఎన్టీఆర్, శివాజీ గణేషన్ కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుంటుండగా మధ్యలో ఈ అనుబంధాన్ని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న కలెక్షన్ కింగ్ ని ఇందులో చూడొచ్చు. ఈ ఇద్దరితో నటించే అదృష్టం కూడా గతంలోనే మోహన్ బాబుకు దక్కింది. ఎన్టీఆర్ 1996లో స్వర్గస్థులు కాగా ఐదేళ్ల తర్వాత శివాజీ గణేషన్ 2001లో పరమపదించారు. అందుకే ఇలాంటి జ్ఞాపకాలు చాలా అపురూపంగా అనిపిస్తాయి. మోహన్ బాబు హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇలాంటి అరుదైన ఘట్టాలకు సాక్షిగా నిలిచారు. ప్రస్తుతం ఈయన సూర్య ఆకాశం నీ హద్దురాతో పాటు మణిరత్నం పోన్నియాన్ సెల్వన్ లో నటిస్తున్నారు.ఈ రెండూ తమిళ్ వే కావడం విశేషం. తెలుగులో మాత్రం ఇంకా ఏ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు.