వైస్సార్‌సీపీలో ఉత్సాహం.. టీడీపీలో నిస్తేజం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగింది. పండగ ముగిసిన మరుసటి రోజే అధికరికంగా ఎన్నికల నగారా మోగనుంది. పండగ రానే వచ్చింది. ఇక మూడు రోజుల్లో ఎన్నికల బరిలోకి అన్ని రాజకీయ పార్టీలు దిగాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒక ఎత్తయితే.. స్థానిక సంస్థలు మరో ఎత్తు. స్థానిక సంస్థల్లో గెలిచిన పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలపడే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలతోపాటు స్థానిక నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

మునుపెన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ పరిస్థితిపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అంతర్మథనం చెందుతున్నారు. మూడు దశాబ్ధాల చరిత్ర, గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్‌ ఉన్నాదని చెప్పుకునే టీడీపీ ఈ ఎన్నికల్లో కనీస పోటీని ఇవ్వగలదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీరే ప్రధాన కారణభూతమవుతోంది.

అంతా అమరావతి చుట్టూనే..

ఏ ఎన్నికలైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అన్ని పార్టీల అధినాయకుల కన్నా ముందుండే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి మాత్రం స్థానిక ఎన్నికలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. అమరావతే జీవన్మరణ సమస్య అన్నట్లుగా ఆ ఉద్యమం పేరున పోరాటాలు చేస్తున్నారు. ఎన్నికల ఊసే ఎత్తకపోవడంతో తమ్ముళ్లకు పాలుపోవడంలేదు. అధినేత తీరుతో ఢీలా పడుతున్నారు. ముఖ్యనేతలతో సమీక్షలు, జిల్లా సమీక్షలు, పార్లమెంట్‌ జిల్లా సమీక్షలు.. ఇలా ప్రతి సారి కనిపించే హడావుడి ఈ సారి మచ్చుకు కూడా కనిపించడంలేదని ఆ పార్టీ క్యాడర్‌లో నిరుత్సాహస్వరం వినిపిప్తోంది.

ముందున్న వైఎస్సార్‌సీపీ..

అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నిలకు సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు స్థానిక సంస్థల ఎన్నికలపై స్సష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో భేటీ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక, సమన్వయం తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది. అయితే ఏవరికి సీటు దక్కుతుందో ఇప్పటికే ఆశానువాహులకి స్పష్టత లభించింది. దీంతో వారు ఎన్నికలను ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు.

నెల రోజుల్లో ముగియనున్న ప్రక్రియ..

ఈ నెల 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీలోపు మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 17వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి విడతలో 333, రెండో విడతలో 327 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొదటి విడతలో 333 జడ్పీటీసీ, 5,352 ఎంపీటీసీ, రెండో విడతలో 327 ఎంపీటీసీ, 4,877 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో సగం మండలాలు, రెండో విడతలో మిగతా సగం మండలాల చొప్పున ప్రతి జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి.

Show comments