Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్‌గా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను మారుస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులకు నంద్యాల శాంతిరాం హాస్పిటల్, పెంచికలపాడులోని విశ్వభారతి వైద్యశాలలలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు సాధారణ రోగులకు ఇబ్బందులు ఎదురు కాకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్‌లోనే కరోనా బాధితులకు చికిత్స అందించింది.
కానీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలని స్టేట్ కొవిడ్ హాస్పిటల్‌గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కర్నూలు ఆసుపత్రికి కరోనా నిర్ధారణ చేసే వైరాలజీ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక పరికరాలు, వసతులు సమకూరనున్నాయి. కరోనా బాధితుల కోసం భారీగా పడకలు అందుబాటులోకి రానున్నాయి.అలాగే కరోనా చికిత్సకు సంబంధించి పల్మనాలజిస్టులు, ఫిజీషియన్‌లు, అనస్థీషియా, ఈఎన్‌టీ వైద్యులు, నిపుణులైన వైద్యులు అధిక సంఖ్యలో అందుబాటులో ఉంటారు. క్రిటికల్ స్టేజీకి చేరుకున్న రోగులకు మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యం, వెంటిలేటర్లు అందుబాటులోకి వస్తాయి.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్ కొవిడ్ ఆసుపత్రిగా మార్చడంతో సాధారణ వైద్య సేవల కోసం నగరంలోని 12 ప్రైవేటు ఆసుపత్రులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌లో వివిధ విభాగాలలో చికిత్స పొందుతున్న 600 మంది నాన్ కొవిడ్ రోగులను మరో రెండు రోజులలో ప్రైవేటు ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రైవేటు హాస్పిటల్‌లలో వైద్యం పొందే నాన్ కొవిడ్ కేసులకు ఆరోగ్యశ్రీ పథకం లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కింద చికిత్స ఖర్చు చెల్లిస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేటు హాస్పిటల్స్‌కు రోగులను తరలించే ప్రక్రియను పర్యవేక్షించడానికి కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీ ప్రసాద్‌కు అప్పగించారు. కరోనా సోకని రోగులకు ప్రైవేటు హాస్పిటల్స్ వైద్యం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జి. వీరపాండియన్ హెచ్చరించారు.
రోగులు చికిత్స కోసం మొదట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ వస్తే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు. కరోనా వైరస్ నెగిటివ్ గా తేలితే ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు హాస్పిటల్స్‌కు పంపి చికిత్స అందించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.