iDreamPost
android-app
ios-app

రాఖీ భాయ్ సూపర్ స్ట్రాటజీ

  • Published Mar 14, 2020 | 4:57 AM Updated Updated Mar 14, 2020 | 4:57 AM
రాఖీ భాయ్ సూపర్ స్ట్రాటజీ

2018లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కెజిఎఫ్ సీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. అక్టోబర్ 23న రాఖీ భాయ్ థియేటర్లలో అడుగు పెడతాడని అధికారికంగా ప్రకటించేశారు. దీన్ని బట్టి షూటింగ్ దాదాపు అయిపోయినట్టేనని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు కన్నడ తమిళ్ నుంచే కాకుండా హిందీలోనూ కెజిఎఫ్ చాప్టర్ 2 మీద భారీ పెట్టుబడులు రెడీ చేసుకుంటున్నారు. ఈసారి బాహుబలి రికార్డులను టార్గెట్ చేసినట్టుగా ఇప్పటికే శాండల్ వుడ్ మీడియా కథనాలు వడ్డించేస్తోంది.

ఇప్పుడీ అనౌన్స్ మెంట్ ని ఇతర నిర్మాతలకు ఓ హెచ్చరికగా చెప్పొచ్చు. మీడియం రేంజ్ సినిమాలను కెజిఎఫ్ 2కి పోటీగా నిలబెడితే చాలా రిస్క్. ఫస్ట్ పార్ట్ కంటే రెట్టింపు స్థాయిలో స్క్రీన్స్ డిమాండ్ ఉంటుందని ఇప్పటికే ట్రేడ్ ఓ అంచనాలో ఉంది. ఒకవేళ ఏదైనా బరిలో దిగినా దీన్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. అయితే అదే సీజన్ ని లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ చేసుకుంటున్న మెగాస్టార్ ఆచార్య ఇప్పుడు ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ కెజిఎఫ్ 2తో తలపడినా వసూళ్ల పరంగా షేర్ పంచుకోవాల్సి ఉంటుంది.

కర్ణాటకలోనూ బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న చిరుకి కెజిఎఫ్ 2తో క్లాష్ వల్ల అక్కడ మాత్రం తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఆచార్య టీమ్ తో కనుక్కుని కెజిఎఫ్ 2 ని ప్రకటించారా అనే సందేహం కూడా మొదలవుతోంది. యాష్ నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నుంచి సంజయ్ దత్, రవీనాటాండన్ లాంటి సీనియర్ యాక్టర్లు వచ్చి చేరడంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. గోల్డ్ మైన్స్ ని హస్తగతం చేసుకున్నాక రాఖీ భాయ్ ఎదురుకున్న పరిస్థితులు ఏంటి, అతని జీవితం ఎలా చివరి మజిలీకి చేరుకుంది లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకో ఏడు నెలలు వేచి చూడాల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ 2లో తెలుగు నుంచి రావు రమేష్ లాంటి నటులు కూడా కీలక పాత్రలు పోషించారు.