బాబు, పవన్ లకి గట్టి సమాధానం ఇచ్చిన కేసీఆర్

ఏపీలో జగన్ ఏమి చెప్పినా విమర్శించడం, తెలంగాణాలో కేసీఆర్ ఏది మాట్లాడిన మౌనంగా ఉండడం చంద్రబాబు కి అలవాటుగా మారింది. ఓటుకి నోటు కేసు నాటి నుంచి ఈ ప్రక్రియ ఆయన అలవాటు చేసుకున్నారు. చివరకు ఇప్పుడు రెండు నెలలుగా అక్కడే నివాసం ఉంటున్నప్పటికీ కేసీఆర్ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. తానో జాతీయ పార్టీ అధ్యక్షుడినని చెప్పుకుంటూనే తన సొంతపార్టీ కార్యకర్తల శ్రేయస్సుని కూడా ఆయను ఖాతరు చేయడం లేదు. కేసీఆర్ కి ఆగ్రహం కలిగించే ఏ చిన్నపని అది మాటయినా, చేష్టలయినా చేయకూడదనే గట్టి సంకల్పంతో చంద్రబాబు ఉన్నట్టు స్పష్టమవుతోంది. జనసేన అధినేత పరిస్థితి కూడా అంతే. తన సినిమాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా పవన్ కూడా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్నవన్నీ ఒప్పులే, కానీ అదే పనిలో ఏపీలో చేస్తే మాత్రం తప్పు అన్నట్టుగా మాట్లాడడానికి అలవాటు పడ్డారు.

కరోనాతో సహజీవనం చేయక తప్పని పరిస్థితి అందరికీ ఉందని ఏపీ సీఎం జగన్ పది రోజుల నాడు ప్రకటించారు. దానికి అనుగుణంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఆదిశలోనే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో భరోసా కల్పిస్తూ, తాము చేపట్టబోయే కార్యాచరణను వెల్లడించారు. అంతే టీడీపీ, జనసేన నేతలు తమ నోటికి పనిచెప్పారు. జగన్ మాటలను వక్రీకరించి కొంత, వాస్తవాలపై దుష్ప్రచారం కొంత సాగించారు. విశ్వవ్యాప్తంగా ఉన్న అనుభవాలు, వివిధ ప్రపంచ స్థాయి సంస్థల నివేదికల ఆధారంగా చెప్పిన జగన్ మాటలను ట్రోల్ చేసేందుకు సాహసించారు. కానీ తాజాగా మోడీ నుంచి కేజ్రీవాల్ వరకూ అందరిదీ అదే మాట. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ పాటనే అందుకున్నారు. అంటే జగన్ చెప్పిన మాటనే అందరూ అంగీకరించక తప్పని పరిస్థితి ఉందనేది వాస్తవం. మరి కేసీఆర్ కూడా జగన్ చెప్పిన రీతిలోనే కరోనా మరికొంత కాలం పాటు మన చుట్టూ ఉంటుందనే విషయం స్పష్టం చేసిన తర్వాత టీడీపీ, జనసేన నేతలు అదే రీతిలో స్పందిస్తారా అంటే వారి నుంచి సైలెన్స్ మాత్రమే సమాధానం అవుతుంది.

మద్యం దుకాణాల విషయంలోనూ అదే తంతు. అనుమతి ఇచ్చి, అన్ని రాష్ట్రాలలో షాపులు తెరవడానికి కారణమయిన కేంద్రం మీద పల్లెత్తుమాట అనరు.అనలేరు. చివరకు పవన్ కళ్యాణ్ అయితే కరోనా ఫ్రెండ్లీ స్టేట్ అంటూ ఏపీని అవమానించే రీతిలో మాట్లాడతారు. తాము మిత్రపక్షంగా ఉన్న పార్టీ నిర్ణయంతోనే మద్యం మళ్లీ జనంలోకి వచ్చిందనే సంగతిని విస్మరించి వ్యాఖ్యానిస్తారు. ఇక చంద్రబాబు మాటలయితే చెప్పతరం కాదన్నట్టుగా ఉన్నాయి. మరి అదే తరహా విమర్శలు ఇప్పుడు కేసీఆర్ మీద గురిపెట్టగలరా…సమీప రాష్ట్రాలన్నీ మద్యం షాపులు తెరిచిన తర్వాత మనమేలా ఊరుకోగలం అంటూ ఆయన ప్రశ్నించారు. మరి కర్ణాటక, చత్తీస్ ఘడ్, ఒడిశాల, పాండిచ్చేరిలో మందు అమ్మకాలు మొదలయితే సమీప ఆంధ్రా ప్రాంత ప్రజలు ఆగుతారా..అదుపు చేయడం మనతరం అవుతుందా..అందుకే ముందుచూపుతో జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానిని విమర్శించిన వాళ్లకు ఇప్పుడు కేసీఆర్ ఘాటు సమాధానం పెద్ద ఝలక్ అవుతుందనే చెప్పవచ్చు.

జగన్ ని విమర్శించడం, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడమే లక్ష్యంతో విపక్షాలు పనిచేస్తున్నంత కాలం ప్రజల్లో వారి పట్ల విశ్వాసం మరింత సన్నగిల్లుతుందే తప్ప పెరిగే అవకాశం లేదు. కేసీఆర్ , మోడీ చేసినవన్నీ ఒప్పులే కానీ జగన్ చేస్తే మాత్రం అది తప్పు అవుతుందని భావించి, బహిరంగంగా వ్యాఖ్యానించే నేతలకు ప్రజల్లో గుర్తింపు ఉంటుందని భావించడం ఓ భ్రమ అవుతుంది. కాబట్టి జగన్ మీద విమర్శలు చేసే ముందు తమ పరిధిని ఆలోచించుకోవడం ఆయా పార్టీలకు మేలు అని చెప్పక తప్పదు.

Show comments