iDreamPost
iDreamPost
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు చిక్కుల్లో పడింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలు బెంగుళూరు అంగ్సాన రిసార్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తిరుగుబాటు చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింథియా ఆధ్వర్యంలో ఈ తిరుగుబాటు జరుగుతుంది.
కాగా నేడు జ్యోతిరాదిత్య సింథియా అమిత్ షా తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వీరి తిరుగుబాటుతో మైనారిటీలో పడుతుంది. దీంతో జ్యోతిరాదిత్య సింథియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి 20 మంది మంత్రులతో రాజీనామా చేయినచారు. దీంతో పాటుగా జ్యోతిరాదిత్య సింథియాకు మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవిని కూడా ఇవ్వడానికి అంగీకరించారు. కానీ జ్యోతిరాదిత్య సింథియాతో మాట్లాడటానికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
జ్యోతిరాదిత్య సింథియా బీజేపీలో చేరి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. జ్యోతిరాదిత్య సింథియా ప్రధాని మోడీతో చర్చల అనంతరం మధ్య ప్రదేశ్ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో తూర్పు పశ్చిమ భాగాలుగా విడదీసి ఒక ప్రాంతానికి ప్రియాంక గాంధీ, మరో ప్రాంతానికి జ్యోతిరాదిత్య సింథియా ప్రచార బాధ్యతలు స్వీకరించారు. కాలికి బలపం కట్టుకుని ప్రతి నియోజకవర్గం తిరిగిన మొత్తం 80 స్థానాల్లో ఒక్క సోనియాగాంధీ మాత్రమే గెలిచారు. చివరకు రాహుల్ గాంధీ కూడా అమేధీ నుండి ఓటమి పాలయ్యారు.
మరోవైపు సొంత నియోజకవర్గం గుణ నుంచి జ్యోతిరాదిత్య సింథియా స్వయంగా ఓడిపోయారు. గుణ నియోజకవర్గం సింథియాలకు పెట్టని కోట.. గుణ నియోజకవర్గం నుండి సింథియాలకిది తొలి ఓటమి. కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ కుట్ర వల్లనే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయానని సింథియా వర్గం బలంగా నమ్మింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కూడా వీరి వర్గానికి పెద్దగా పరపతి లేకుండా పోయింది. పేరుకే మంత్రులు కానీ, వారి మాటలు చెల్లుబాటు కావడంలేదు.
గత నవంబర్ లోనే జ్యోతిరాదిత్య సింథియా తన ట్విట్టర్ అకౌంట్ నుండి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్న హోదాను తొలగించారు. అధిష్టానం చేసిన చర్చలతో అప్పుడు శాంతించినా ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రిని కలవడంతో సింథియాకు కాంగ్రెస్ తో అనుబంధం తెగినట్లుగానే భావించాలి.
జ్యోతిరాదిత్య నాయనమ్మ విజయరాజే సింథియా మొదటినుండి జనసంఘ్-బీజేపీ నాయకురాలు,పలుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1984లో గ్వాలియర్ నుండి పోటీ చేసిన వాజ్ పేయ్ ని కాంగ్రెస్ తరపున పోటీచేసిన మాధవ్ రావ్ సింథియా ఓడించడంతోనే విభేదాలు మొదలయ్యాయి. చివరికి తన వీలునామాలో కూడా తన కొడుకు మాధవ్ రావ్ సింథియాకు వారసత్వం దక్కకూడదని రాసారు. మాధవ్ రావ్ సింథియా కోర్టుకు వెళ్లి, వారసత్వ హక్కును గెలుచుకున్నారు.
జ్యోతిరాదిత్య సింథియా మేనత్త వసుంధర రాజే బీజేపీ తరపున పలుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిరాదిత్య సింథియా మరో మేనత్త యశోధరా రాజే మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వాలలో అనేకసార్లు మంత్రిగా పని చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఎదురవుతున్న నిరాదరణ, వర్గపోరు తదితర కారణాలతో బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో మాధవ్ రావ్ సింథియా పేరుకూడా ప్రధానమంత్రి పదవికి బలంగా వినిపించేది. భవిష్యత్తులో కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ మద్దతు ప్రభుత్వాలలో ప్రధానమంత్రి పదవికి పోటీ పడదగ్గ జ్యోతిరాదిత్య సింథియా రాజకీయ జీవితం ఏ మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.